
మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాజాగా జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్లో ఉన్న చిరు ఇల్లు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు.
చిరంజీవి తరఫు న్యాయవాది వాదనల ప్రకారం.. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని చిరు నిర్మించారని తెలిపారు. అయితే, పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చిరు ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు ఆయన తెలిపారు. చిరంజీవి దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని అధికారులను హైకోర్ట్ ఆదేశించింది.