మైసూర్ శాండల్‌తో తమన్నా ఢీల్‌పై విమర్శలు.. మంత్రి వివరణ | Tamannaah Bhatia Select Brand Ambassador for Mysore Sandal Soap After Explains Karnataka Govt | Sakshi
Sakshi News home page

మైసూర్ శాండల్‌తో తమన్నా ఢీల్‌పై విమర్శలు.. మంత్రి వివరణ

May 22 2025 6:29 PM | Updated on May 22 2025 8:30 PM

Tamannaah Bhatia Select Brand Ambassador for Mysore Sandal Soap After Explains Karnataka Govt

నటి తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే, ఈ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది.  కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ సబ్బుకు  ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక నటుడిని ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడిగులు ప్రశ్నించారు.

ఈ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ.. కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్‌ అయ్యారు. ప్రస్తుత మార్కెట్‌లో పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయంటూ..  ఈ నిర్ణయాన్ని సమర్థించారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత  గౌరవం ఉందన్నారు. కానీ, కెఎస్‌డిఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తాము పాన్-ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేశామన్నారు.

తమన్నా ఎందుకు?
మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను  ఎంచుకోవడం వెనుక నాలుగు ముఖ్య కారణాలను మంత్రి వివరించారు.
పాన్-ఇండియా రేంజ్‌లో గుర్తింపు: తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. జాతీయ స్థాయి మార్కెట్‌లో ఆమెకు గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటే మరింతగా విస్తరించవచ్చు.

మార్కెట్ విస్తరణ: KSDL కర్ణాటకేతర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనుభవం: తమన్నాకు హై-ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడిర్‌గా పనిచేశారు. ఆమెకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆమె ద్వారా సులువుగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందొచ్చు.

బోర్డు ఆమోదం: తమన్నా ఎంపికను మార్కెటింగ్ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ద్వారా మాత్రమే తీసుకున్నారు. అందుకు PSU  డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది.

రూ. 6.2 కోట్ల డీల్
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తయారు చేస్తున్న  మైసూరు శాండల్ స‌బ్బుల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించబడ్డారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది.  ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం కర్ణాటక చెల్లించనున్నట్లు సమాచారం.

కర్ణాటకకు గుర్తింపుగా ఉన్న మైసూరు శాండల్ సోప్‌కు ఒక కన్నడ స్టార్‌ను ఎంపికి చేసుంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాతీయ గుర్తింపును ప్రోత్సహించడంలో విఫలం అయ్యారని చెబుతున్నారు. కర్ణాటకతో వందేళ్ల అనుబంధం ఉన్న ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కన్నడ నటిని కాకుండా మరొక ప్రాంత నటిని తీసుకోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార లక్ష్యాలను అందుకునే వ్యూహాత్మకతలో భాగమని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement