తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..? | Tamannaah Bhatia Still No One Movie Chance After Vijay Varma Love | Sakshi
Sakshi News home page

తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..?

May 21 2025 7:16 AM | Updated on May 21 2025 9:38 AM

Tamannaah Bhatia Still No One Movie Chance After Vijay Varma Love

పాన్‌ ఇండియా కథానాయకి నటి తమన్న. తన 15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె తొలుత హిందీ చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. అయితే మొదట్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీ చివరి వరకూ ఆ గ్లామర్‌తోనే తమన్నాను స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. మధ్యలో తనలోని నటనకు పదును పెట్టే పాత్రలు వచ్చినా అవి చాలా తక్కువగా పరిమితం అయ్యాయి. తమన్నా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇక అప్పుడప్పుడూ ఐటమ్‌ సాంగ్స్‌తో అందాలను వెండితెరపై ఆరబోస్తూ కుర్రకారు హాట్‌ బీట్‌ను పెంచేస్తూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. అలా ఐటమ్‌ సాంగ్స్‌కు స్పెషలిస్ట్‌గా ముద్ర వేసుకున్నారు. 

ఐతే కథానాయకిగా తమన్నా రెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్‌ చేశారు. ఇప్పటికి ఈ బ్యూటీ వయసు జస్ట్‌ 35 ఏళ్లే. మొన్న జైలర్‌ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌తో ఇరగదీశారు. అలాంటిది ఇప్పుడు దక్షిణాదిలో ఈ భామకు ఒక్కటంటే ఒక్క సినిమా లేక పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల సుందర్‌ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై – 4 చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు. ఇదే విధంగా తెలుగులో విభిన్న పాత్రలో నటించిన ఓదెల – 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారీ భామ. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తమన్నా కన్నా వయసులో పెద్దవారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి తమన్నా విజయ్‌ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు ఈమె కెరీర్‌‌ కు ఎఫెక్ట్‌ అయ్యాయా? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడ్డారు. తన గ్లామరస్‌ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement