
తమన్నా.. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. కుర్రహీరోయిన్లు వస్తున్నా వాళ్లకి పోటీగా హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే తాను ఇప్పుడు ఇలా ఉండటానికి అల్లు అర్జున్ కూడా ఓ కారణం అని చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా 'డూ యూ వాన్నా పార్ట్‌నర్' అనే వెబ్ సిరీస్‍లో లీడ్ రోల్ చేసింది. దీని ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.
'అప్పట్లో తెలుగు, తమిళంలో అన్ని రకాల కమర్షియల్ సినిమాలు చేశాను. ప్రతి దానిలోనూ నాలుగైదు సాంగ్స్ ఉండేవి. కానీ అల్లు అర్జున్ మాత్రమే 'బద్రీనాథ్' కోసం నేను కూడా తనతో పాటు సరిసమానంగా డ్యాన్స్ చేయాలని ప్రోత్సాహించాడు. ఫ్లోర్ మూమెంట్స్ నేను కూడా చేస్తానని చెప్పి దర్శకుడిని ఒప్పించి తొలి అవకాశమిచ్చాడు. ఈ మూవీ రిలీజైన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఛాన్సులు చాలా వచ్చాయి. స్పెషల్ నంబర్స్‌కి పాపులర్ అయ్యాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)
తమన్నా చెప్పింది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లలో బాలీవుడ్‍లో హిట్ స్పెషల్ సాంగ్స్ ఈమె కనిపించింది. 'ఆజ్ కీ రాత్', నషా, స్పింగ్ జరా, గఫూర్.. ఇలా తదితర పాటల్లో ఓవైపు గ్లామర్ చూపిస్తూ మరోవైపు తన అందచందాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. అలానే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
తమన్నా వ్యక్తిగత విషయానికొస్తే ప్రస్తుతం ఈమె వయసు 35 ఏళ్లు. వయసు పెరుగుతున్నా సరే ఈమెకు అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. అలానే మొన్నమొన్నటివరకు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.
(ఇదీ చదవండి: వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి)