బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ నటించిన చిత్రం ‘ది తాజ్ స్టోరీ’. సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదంగా నిలిచింది. సురేశ్ ఝూ ఈ మూవీని నిర్మించగా.. దర్శకుడు తుషార్ అమ్రిష్ గోయెల్ తెరకెక్కించారు. జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, స్నేహ వాఘ్, నమిత్ దాస్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు.
ది తాజ్ స్టోరీ మూవీ లయన్స్‌గేట్ ప్లే(Lionsgate Play)లో ప్రసారం కానుంది. మార్చి 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. తాజ్‌మహల్‌ను నిర్మించింది నిజంగా షాజహానా..? లేకపోతే దాని వెనుక ఏదైనా తెలియని రహస్యం ఉందా..? అనే పరిశోధన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. సినిమా పోస్టర్ విడుదల సమయంలో తీవ్రమైన వివాదం కొనసాగింది. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో విడుదలైన పోస్టర్ అనేక చర్చలకు దారితీసింది. విష్ణు దాస్ అనే టూర్ గైడ్ తాజ్ మహల్ వెనుక దాగిఉన్న నిజమైన చరిత్రను వెలికితీసే ప్రయాణమే ఈ చిత్రం.

తాజ్ మహల్ ఒక పురాతన శివాలయం ("తేజో మహాలయ") అని, దీనిని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పి.ఎన్. ఓక్ వాదించిన వివాదాస్పద సిద్ధాంతం. ఇది శివాలయమని, 4వ శతాబ్దంలో రాజా పరమార్ధి దేవ్ నిర్మించారని, 17వ శతాబ్దంలో షాజహాన్ దీనిని మార్చారని కొందరు నమ్ముతారు, కానీ పురాతత్వ శాఖ దీనిని నిరాకరించింది. ఇదే పాయింట్‌తో సినిమా ఉందని వాదనలు రావడంతో చరిత్రకారులు, న్యాయవాదులు ఈ విషయంపై కోర్టులో పోరాటానికి దారితీసింది.


