
దక్షిణాదిలో ప్రముఖ కథానాయకుల్లో రాణిస్తున్న నటుడు సూర్య. ఈయన ఇటీవల హీరోగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కరుప్పు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి శ్వాసిక, ఇందిరెన్స్, యోగి బాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే డివోషనల్ అంశాలతో సాగే సోషియల్ కథాచిత్రంగా రూపొందుతున్న కరుప్పు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు యూనిట్ వర్గాలు ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ విడుదుల కానుంది. ఆపై శివకార్తికేయన్ ,రవి మోహన్, శ్రీ లీల, అధర్వ కలిసి నటిస్తున్న పరాశక్తి కూడా రానుంది.

సంక్రాంతి కోసం తెలుగులో ఇప్పటికే భారీగానే లైనప్ ఉంది. దీంతో సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పోటీలో ఉండి ఇబ్బందులు పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్చిస్తున్నారట. ఏదేమైనా పొంగల్ రేసు నుంచి సూర్య తప్పుకోనున్నారనేది తెలుస్తోంది.