‘అశ్రు నయనాలతో బాలుకి నివాళులు’

SP Balu Died; Harish Rao, Komati Reddy Express Deep Condolence - Sakshi

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు అనే వార్త అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులను కంటతడిపెట్టిస్తోంది. తన అద్భుత స్వరంతో ఎన్నో మైమరిపించే పాటలను అందించిన బాలుకి ప్రతి ఒక్కరూ అశ్రునయనాలతో తుది విడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో గాన గంధర్వుడు బాలు అస్తమయం వార్త తనను తీవ్ర ధ్రిగ్భాంతికి గురి చేసిందని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. (బాలుతో చిన్నప్పటి నుంచి పరిచయం: ఉప రాష్ట్రపతి)

‘యావత్ భారతావనికి తన గానామృతంతో మైమరపింపజేసిన బాలు గారి మరణ వార్త విషాదకరం. ఇకపై మీ గొంతు ముగబోతుంది అన్న చేదు వార్త  యావత్ భారతావని జీర్ణించుకోలేక పోతుంది.. ఇకపై మీరు పాడిన పాటలు జ్ఞాపకాలలో మిమ్మల్ని చూసుకుంటాం.. అశ్రు నయనాలతో ఆయనకి నివాళి తెలుపుతున్నాను.’ అని ట్వీట్‌ చేశారు. (బాలు మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి)

బాలు గారి లోటు ఎన్నటికీ పూడ్చలేనిది
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరమని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివని, అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. 

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల సానుభూతి తెలియ జేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు  సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని  భగవంతున్ని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. (బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి )

ఆయన లేరనే వార్త తీవ్రంగా కలచి వేసింది
‘4 దశాబ్దాల కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడి గాన గంధర్వుడిగా అనేక మంది అభిమానులను పొందారని మంత్రి తలసాని శ్రీనివస్‌ యాదవ్‌ అన్నారు. ఈ మేరకు ‘100కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. పాటల దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయకుడిగా, నటుడిగా చలనచిత్ర రంగానికి అనేక సేవలు అందించారు. బాలు మృతితో చలనచిత్ర రంగం ఒక ప్రఖ్యాత గాయకుడిని కోల్పోయింది. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపారు.

గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. ‘గాయకుడు ఎస్పీ బాలు గారి మరణం అత్యంత బాధాకరం. పాటల ప్రపంచంలో ఆయన గాన గంధర్వుడు. అనేక భారతీయ భాషల్లో పాడిన అద్భుత గాయకుడు. వారి మరణం యావత్తు దేశానికి, పాటల ప్రియులకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top