హైదరాబాద్‌లో దక్షిణాది సినీ నిర్మాతల కీలక సమావేశం
నిర్మాతల సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీ
సినిమా నిర్మాణాన్ని సవాల్ చేస్తున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) చెందిన అగ్ర సినీ నిర్మాతలు, సంబంధిత ప్రతినిధులు, ప్రోడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు ఏకతాటి పైకి వచ్చారు. సినిమా పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ (ఎస్‌ఐఎఫ్‌పీఏ) ఏర్పాటైంది.
ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘ఎస్‌ఐఎఫ్‌పీఏ’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సినిమా నిర్మాణ రంగంలో ఇతర స్టేక్ హోల్డర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 8 వారాల తర్వాతనే ఓటీటీలో సినిమాను విడుదల చేయాలి, సినిమా రిలీజ్‌ల విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి (థియేట్రికల్ రెవెన్యూకు సంబంధించి పర్సెంటేజ్ అండ్ రెంటల్ వివాదాన్ని ఉద్దేశించి కావొచ్చు) అంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఈ సమావేశంలో నిర్మాతలు ఖండించారు.
వేలాది మంది ఉపాధి ఆధారపడి ఉన్న సినిమా నిర్మాణ వ్యవస్థలో ఆకస్మాత్తు నిర్ణయాలు తీసుకుని, రాత్రికి రాత్రి ఆటంకం కలిగించకూడదని ఈ సమావేశంలోని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన నోట్‌లోని అంశాలు ఈ విధంగా... ‘‘నిర్మాతల ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు కాపాడటానికి ‘ఎస్‌ఐఎఫ్‌పీఏ’ను ఏర్పాటు చేయడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.
నాలుగు భాషలకు చెందిన దక్షిణాది నిర్మాతల మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం సభ్యులైన నిర్మాతలు తమ సినిమాల నిర్మాణం, విక్రయం, విడుదల తేదీ వంటి అంశాల విషయంలో ఏ ఇతర సంఘం నిబంధనలకు కట్టుబడకుండా తమ సొంత నిర్ణయాలతో కొనసాగాలి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాల విడుదల విషయంలో ఎటువంటి హామీ పత్రాలను నిర్మాతలు ఏ అసోసియేషన్‌కు లేదా రంగానికి ఇవ్వకూడదు. సినిమా పరిశ్రమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిబంధనలను అందరితో చర్చించి మాత్రమే నిర్ణయించుకోవాలి’’ అంటూ ‘ఎస్‌ఐఎఫ్‌పీఏ’ స్టీరింగ్ కమిటీ ఆ నోట్‌లో పేర్కొంది.


