దర్శకులుగా మారుతున్న యాక్టర్స్
యాక్టర్స్‌గా స్క్రీన్‌పైకి వస్తున్న టెక్నీషియన్స్
ఇప్పటివరకూ తెరపై యాక్టర్స్‌గా తమదైన శైలిలో నటించి, ప్రేక్షకుల మన్ననలను పొందిన కొందరు స్టార్స్ ఇప్పుడు మెగాఫోన్ పట్టారు. దర్శకులుగా తమ సత్తా చాటడానికి రెడీ అయిన ఆ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.
యాక్టర్స్ డైరెక్టర్స్‌గా మారడం సినిమా ఇండస్ట్రీలో కొత్తేం కాదు. అయితే ఏదో ఐదూ పదీ సినిమాలు చేశాక డైరెక్టర్లుగా మారడం కాదు... సుదీర్ఘకాలం యాక్టర్స్‌గా కొనసాగిన కొంతమంది తమ డైరెక్షన్‌ను మార్చి, దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అలాగే సాంకేతిక నిపుణులుగా సక్సెస్ అయిన కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు యాక్టర్స్‌గా పరిచయం కానున్నారు. ఇలా తమ కెరీర్‌లో కాస్త డైరెక్షన్ మార్చిన కొందరిపై మీరూ ఓ లుక్ వేయండి.
ఇక తెరవెనక కూడా...
సూపర్ హీరో సాహసాలు
బాలీవుడ్‌లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ సినిమాకు ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ సూపర్ హీరో సినిమాకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. ఈ ‘క్రిష్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘క్రిష్ 4’. హృతిక్ రోషన్ హీరోగా ఈ సినిమాను రెండేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. తొలుత ఈ సినిమాకు ప్రముఖ దర్శక–నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా తప్పుకున్నారు.
ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు íసిద్ధార్థ్ ఆనంద్ పేరు ‘క్రిష్ 4’కి దర్శకుడిగా వినిపించింది. కానీ ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం లేదని, ఓ సందర్భంలో సిద్ధార్థ్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘క్రిష్ 4’ సినిమాకు తన కొడుకు హృతిక్ రోషన్ డైరెక్షన్ చేస్తాడని, ఈ సూపర్ హీరో సాహసాలను తనదైన స్టైల్లో తెరకెక్కించడానికి హృతిక్ రోషన్ సిద్ధంగా ఉన్నారని రాకేష్ రోషన్ చెప్పారు.
తన 25 సంవత్సరాల సినీ కెరీర్‌లో హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ ‘క్రిష్ 4’ సినిమాను నిర్మించనున్నారని బాలీవుడ్ సమాచారం. కాగా, హృతిక్ రోషన్–నిర్మాత ఆదిత్య చోప్రా కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన ‘వార్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో ఈ ప్రభావం ‘క్రిష్ 4’ చిత్రంపై పడే అవకాశం ఉందని, దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందనే టాక్ బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
మకుటం
రెండు దశాబ్దాలుగా యాక్టర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తూ, తన సత్తా చాటుకుంటున్నారు హీరో విశాల్. ఇప్పుడు దర్శకుడిగా విశాల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. విశాల్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మగుడం’. ఈ సినిమాకు తెలుగులో ‘మకుటం’ అనే టైటిల్ ఖరారు చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రవి అరసు దర్శకుడిగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కానీ విశాల్‌కు, రవి అరసుకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించారు విశాల్.
కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ‘మకుటం’ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం లేదని ఇటీవల విశాల్ పేర్కొన్నారు. అలాగే తాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు విశాల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. భారీ స్థాయిలో క్లై్లమాక్స్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో కృపాకర్ అనే పాత్రలో విశాల్ కనిపిస్తారట. ఇంకా ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చౌదరి ‘మకుటం’ను నిర్మిస్తున్నారు. ఈ సిని
ఆర్డినరీ మ్యాన్
ఇండస్ట్రీలో హీరోగా ఇరవై సంవత్సరాల సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రవి మోహన్ (‘జయం’ రవి) ఇటీవల రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ రవి మోహన్ స్టూడియోస్‌లో సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించనున్నట్లుగా ఆయన తెలిపారు. అంతే కాదు... తన నిర్మాణ సంస్థలోని ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో దర్శకుడిగా మారారు రవి మోహన్. ఈ హీరోకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో యోగిబాబు లీడ్ రోల్‌లో నటిస్తారు. రవి మోహన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఒక ఆర్డినరీ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమని సమాచారం.
వీరే కాదు... మరికొందరు హీరోలు, హీరోయిన్లు దర్శకులుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘ఫతే’ చిత్రంతో సోనూ సూద్, ‘ది మెహతా బాయ్స్’ చిత్రంతో బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు ఆల్రెడీ దర్శకులుగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.
ఎల్లమ్మలో...
రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. కొన్ని పాటల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టర్‌గా వెండితెరపై కనిపించనున్నారట దేవిశ్రీ ప్రసాద్. ‘బలంగం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వేణు యెల్దండి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోలంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు వినిపించాయి.
కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందట. ఈ ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తారని, హీరోయిన్‌గా కీర్తీ సురేష్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాకు తొలుత తమిళ సంగీత దర్శక ద్వయం వివేక్–మెర్విన్‌లు స్వరాలు సమకూర్చనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారనే టాక్ కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
మళ్లీ యాక్టర్‌గా...
సంగీత దర్శకుడిగా తమన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బిజీ టైమ్‌లోనూ యాక్టర్‌గా తమన్ ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘ఇదయమ్ మురళి’ మూవీ. అథర్వ మురళి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా తమన్, నిహారిక ఎన్‌ఎమ్, ప్రగ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ ‘ఇదయమ్ మురళి’ సినిమాను ప్రకటించారు.
షూటింగ్ కూడా మొదలైంది. మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ఈ సినిమా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇక యాక్టర్‌గా తమన్‌కు ఇది తొలి చిత్రం కాదు. ఆ మాటకొస్తే... తమన్ కెరీర్ యాక్టర్‌గానే మొదలైంది. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ చిత్రంలో తమన్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆ తర్వాత గెస్ట్ రోల్స్‌లో కనిపించినా కొంత గ్యాప్ తర్వాత తమన్ కీలక పాత్రలో నటిస్తున్నది మాత్రం ‘ఇదయమ్ మురళి’ సినిమాలోనే. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాకు తమన్ సంగీతం కూడా అందిస్తున్నారు.
ప్రేమకథ
అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకుడిగా మారారు. గతంలో అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి సినిమాలకు షానియల్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపిస్తారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది.
యాక్షన్ డ్రామా
‘కల్కి 2898 ఏడీ, కేజీఎఫ్, ఖైదీ, అమరన్..’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్స్‌గా పని చేసిన అన్బు–అరివులు దర్శకులుగా మారారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్నారు. 2024లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఎల్‌యూసీలో డీసీ?
‘మా నగరం’ సినిమాతో దర్శకుడిగా పాపులర్ అయ్యారు లోకేశ్ కనగరాజ్. నెక్ట్స్ మూవీ ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ కావడంతో లోకేశ్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఈ స్టార్ హోదాకు తగ్గట్లే లోకేశ్ కనగరాజ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’, విజయ్‌తో ‘లియో, మాస్టర్’ వంటి చిత్రాలను తెరకెక్కించే చాన్స్ దక్కింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ తమిళ స్టార్ డైరెక్టర్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. రైటర్‌గానూ చేస్తున్నారు. ఇదే స్పీడ్‌లో హీరోగానూ సత్తా చాటాలని నిర్ణయించుకుని, ‘డీసీ’ అనే మూవీని స్టార్ట్ చేశారు లోకేశ్.
గతంలో ఒకట్రెండు సినిమాల్లో గెస్ట్ రోల్‌లో, ఓ మ్యూజిక్ వీడియోలో లోకేశ్ యాక్టర్‌గా కనిపించినా, ‘డీసీ’లో మాత్రం పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్నారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ ‘డీసీ’ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ దాస్‌గా లోకేశ్, చంద్రగా వామిక నటిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్
మిస్టర్ సత్య
తమిళ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషాన్ జీవంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’లో అభిషాన్ నటించినప్పటికీ ఈ చిత్రంలో తనది కీలక పాత్ర మాత్రమే. కాగా అభిషాన్ ఫుల్ లెంగ్త్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో సత్య అనే పాత్రలో నటిస్తున్నారు అభిషాన్.
ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాను కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరించారట మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ కానుందట. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.
ఇలా... దర్శకులుగా మారుతున్న టెక్నీషియన్స్ మరికొంతమంది ఉన్నారు.
సరస్వతి
నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘క్రాక్, నాంది, హనుమాన్, యశోద’ వంటి స్ట్రయిట్ తెలుగు సినిమాలు కూడా చేశారామె. కథ ప్రకారం కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తే, ఇంకొన్నిసార్లు విలన్‌గా మెప్పించారు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ తన సినీ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సరస్వతి’ సినిమాతో తాను దర్శకురాలిగా మారుతున్నట్లుగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో ప్రియమణి, నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడాపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ΄్లాన్ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోశ డైరీస్ పతాకంపై ‘సరస్వతి’ సినిమాను నిర్మిస్తున్నారామె. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గతంలో ‘కన్నామూచ్చి’ అనే సినిమాతో వరలక్ష్మీ శరత్‌కుమార్ దర్శకురాలిగా మారతారన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం పూర్తి స్థాయిలో సెట్స్‌కు వెళ్లలేదన్న వార్తలు ఉన్నాయి.
పీరియాడికల్ డ్రామా
రామ్‌చరణ్ హీరోగా పరిచయం అయిన ‘చిరుత’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నేహా శర్మ గుర్తుండే ఉంటారు. ఈ సినిమా తర్వాత నేహా శర్మ హిందీ, పంజాబీల్లో హీరోయిన్‌గా సినిమాలు చేశారు. ఇటీవల నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో ఓ మోడల్‌గా గెస్ట్ రోల్ చేశారు నేహా. ఆమె దర్శకురాలిగా పరిచయం కానున్నారని టాక్. 1945 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తారని, మోహిత్ కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాను అజయ్ దేవగన్ నిర్మించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది.
ఇక తెరపైకి కూడా...
ఇప్పటివరకూ తెరవెనక టెక్నీషియన్లుగా తమ ప్రతిభ చాటుకున్న సాంకేతిక నిపుణులు కొందరు ఇప్పుడు తెరపై నటులుగా కనిపించడానికి రెడీ అయ్యారు. వీరిలో కొందరు ఇంతకుముందు ఒకట్రెండు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మాత్రం హీరోలుగా కొందరు, లెంగ్తీ రోల్స్‌లో కొందరు కనిపించనున్నారు. ఆ విశేషాలు...
– ముసిమి శివాంజనేయులు


