ఫ్యామిలీ స్టార్స్‌! | Some star heroes focus on family drama films in Tollywood | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ స్టార్స్‌!

Nov 16 2025 12:11 AM | Updated on Nov 16 2025 12:11 AM

Some star heroes focus on family drama films in Tollywood

కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్‌ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్‌ హిట్‌ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్‌ హీరోలు ఫోకస్‌ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్‌ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్‌ వేయండి.

రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! 
శంకర వరప్రసాద్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌. ఫుల్లీ వర్క్‌ మైండెడ్‌. దీంతో పర్సనల్‌ లైఫ్‌కి, వర్కింగ్‌ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్‌ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్‌ ఎలా బ్యాలెన్స్‌ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్‌’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి       ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్‌ ఉన్నాయి.

దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్‌ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్‌ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్‌ కానున్నట్లుగా చిత్రయూనిట్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అబ్బాయిగారు 60 ప్లస్‌ 
‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్‌ కెరీర్‌లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌. ఇప్పుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే వెంకటేశ్‌ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్‌ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్‌ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్‌ పేరు కూడా మేకర్స్‌ రివీల్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్‌ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతాయి. వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ తాజా చిత్రం కూడా వైజాగ్‌ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్‌ తెరపైకి వచ్చింది.

ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్‌ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్‌’ అనే టైటిల్స్‌ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్‌ చేసే ఆలోచనలో  చిత్రయూనిట్‌ ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్‌ కానుంది.

మరోవైపు ఇంటెన్స్‌ క్రైమ్‌ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ మిక్స్‌ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా  ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్‌ కన్ఫార్మ్‌ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్‌ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్‌ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.

రామసత్యనారాయణ విజ్ఞప్తి! 
‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్‌... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్‌ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్‌ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్‌ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ టైటిల్‌ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది.  

తాత–మనవడి కథ 
ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్‌’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్‌ కామెడీ జానర్‌లో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్‌ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ బలంగానే ఉంటాయట.

ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్‌ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్‌ దత్‌ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్‌ పాత్రను సంజయ్‌ దత్‌ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్‌ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్‌. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్‌’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్‌ కానుంది.

విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌ 
‘రంగ్‌ దే, లక్కీ భాస్కర్‌’ వంటి సూపర్‌హిట్‌ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్‌లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్‌ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్‌. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.

మూడు తరాల కథ 
మోటర్‌ రేసింగ్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్‌ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్‌’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో శర్వానంద్‌ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్‌’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ ‘బైకర్‌’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్‌ కానుంది.

మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్‌ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా  మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

లెనిన్‌ 
అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్‌’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్‌’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్‌ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్‌ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్‌. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్‌ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీల కన్ఫార్మ్‌ అయ్యారు. కానీ కాల్షీట్స్‌ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఫ్యామిలీ కథ 
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్‌ అబ్బవరం. కిరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్‌ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్‌ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement