breaking news
family drama films
-
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్‌కి, వర్కింగ్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. -
త్రిభంగ మూవీ: ఎవరి జీవితం వారిదే!
ఒకరి అనుభవాలు ఇంకొకరికి పాఠాలు కావు. ఎవరి జీవితం వారిదే! ఇదే చూపిస్తుంది త్రిభంగ. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం. ఒడిస్సీ నృత్యరీతిలోని అభంగ, త్రిభంగ, సమభంగల ఆధారంగా మూడు ప్రధాన భూమికలను చిత్రీకరించిందీ సినిమా. అభంగ... పాదాల దగ్గర్నుంచి నడుము వరకు ఒక వైపు వంగి ఉండే భంగిమ. ఈ సినిమాలో తొలి తరానికి ప్రతీక. త్రిభంగ.. కాళ్లు, నడుము, భుజాలు ప్లస్ తల.. మూడు మూడు రకాలుగా వంగి ఉండే పోజు. మధ్య తరానికి చిహ్నం ఈ చిత్రంలో. సమభంగ.. బ్యాలెన్స్డ్గా ఉండే భంగిమ.. మూడో తరాన్ని సూచిస్తుంది. ఒక కుటుంబంలోని నిర్ణయాలు పిల్లల మీద చూపే ప్రభావాలు, అవి ఆ కుటుంబంలోని తల్లులను ఇంపర్ఫెక్ట్ మదర్స్‌గా.. కూతుళ్లను డిఫికల్ట్ డాటర్స్గా ఎలా చిత్రించాయో.. ఆ సంబంధ బాంధవ్యాలను చర్చిస్తుందీ సినిమా. కథ.. నయనతార (తన్వీ ఆజ్మీ) రచయిత్రి. మహిళా సమస్యల మీద రచనలతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూంది. ఇద్దరు పిల్లలు అనూరాధ, రబీంద్రో. ఆమె రచనా వ్యాసంగంలో మునిగి ఉంటుంది. అయితే అందరి కోడళ్లలాగే తన కోడలూ ఇంటి బాధ్యతల్లో మునిగి, పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టి, తన సేవలో తరించాలని అనుకుంటుంది ఆ అత్తగారు. ఆ అసంతృప్తిని ఒకరోజు వెళ్లగక్కుతుంది కోడలి స్నేహితుల ముందు. ఏ రచనా ప్రతిభను చూసి తనను ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడో ఆ క్వాలిటీనే అత్తగారు తప్పుబడుతుంటే భర్త నోరుమెదపకుండా తననే సర్దుకుపొమ్మని చెప్పేప్పటికి తట్టుకోలేక పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అనూరాధ, రబీంద్రో టీన్స్‌లోకి వచ్చేనాటికి నయనతార ఒక ఫోటో జర్నలిస్ట్‌తో ప్రేమలో పడి.. అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అతను అనురాధ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ విషయం తల్లికి చెప్పలేక, దాచుకోలేక మానసిక వేదనకు గురవుతుంది. తన ఆ స్థితికి తల్లే కారణమన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటుంది అనూరాధ. తమ్ముడి బాధ్యతను తానే తీసుకుంటుంది తల్లిగా. అందుకే రబీంద్రో కూడా తల్లి పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు. ‘త్రిభంగ’లో దృశ్యాలు అనూరాధ (కాజోల్) ఒడిస్సీ డాన్సర్ అవుతుంది. సినిమానూ కెరీర్‌గా తీసుకుంటుంది. కాంట్రవర్షియల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటుంది. ఒక రష్యన్‌తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది. కూతురిని కంటుంది. ఆ అమ్మాయే మషా (మిథిలా పాల్కర్). సహచరుడు విపరీతంగా హింసించడంతో తెగతెంపులు చేసుకొని సింగిల్ మదర్‌గా పిల్లను పెంచుతుంది. తన తల్లి వల్ల తనేం ఇబ్బందులను ఎదుర్కొందో .. ఎలాంటి అభద్రతకు లోనైందో అవేవీ తన కూతురి కలల్లోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్తుంది అనురాధ. మషా.. ఒక గుజరాతీ ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ ఇంటి పరువు, మర్యాదలను కాపాడుతూ, ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నట్టుగా మనవడినే ఇవ్వాలనే తాపత్రయంతో ఉంటుంది. కూతురి తీరు చూసి అవాక్కవుతుంది అనూరాధ. ‘‘అంత కాంప్రమైజ్ అయ్యి.. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరమేంటి? నువ్వూ నాకు ఆడపిల్లవే కదా.. నిన్ను నేను పారేసుకోలేదు. నేనూ అమ్మమ్మకు ఆడపిల్లనే. నన్ను తను పుట్టకుండానే చంపుకోలేదు కదా?’’ అని ప్రశ్నిస్తుంది కూతురిని. ‘‘నిజమే.. అమ్మమ్మ ఇచ్చిన అభద్రత నీకో పాఠం నేర్పింది. ఆ ఒక్కదానిపట్లే నువ్వు జాగ్రత్తపడ్డావు. నీ బాయ్ ఫ్రెండ్స్ నెవరినీ మనింటికి రానివ్వకుండా కాపాడుకున్నావు. కనీసం మీ నాన్నను నువ్వు చూశావు.. నాకు మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. అందుకే నాకు భద్రమైన కుటుంబ జీవితం కావాలనుకున్నాను. దొరికింది. పణంగా ఏం పెట్టాల్సి వచ్చినా పెడ్తాను’ అంటుంది మషా. ఖిన్నురాలవుతుంది అనూరాధ. తన తల్లిలా తాను ఉండకూడదనుకుంది.. కాని తన కూతురికి ఏం కావాలనుకుంటుందో ఏనాడూ ఆలోచించలేదు అనే అంతర్మథనానికి గురవుతుంది. నయనతార బ్రెయిన్ హేమరేజ్‌తో ఆసుపత్రిలో చేరుతుంది కోమా స్టేజ్‌లో. అప్పుడు తల్లిని చూడ్డానికి వస్తుంది అనూరాధ. ఆ ఆసుపత్రి బ్యాక్‌డ్రాప్‌లో బ్యాక్ఫోర్త్గా కథనం సాగుతుంది. కూతురి మనసులో మాట విని, తల్లి తనకు, తన తమ్ముడికి రాసిన ఉత్తరం చదివి ఆమెనెంత అపార్థం చేసుకుందో గ్రహిస్తుంది అనూరాధ. కానీ అప్పుడేం లాభం ఇక! -
తట్టుకోలేర్రా!!
తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా అన్నది ఎవర్గ్రీన్ జానర్. ఈ జానర్లో వచ్చిన సూపర్‌హిట్ సినిమాలకు లెక్కేలేదు. అలాంటి ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. అంత నిశ్శబ్దాన్ని భరించే శక్తి కూడా అప్పటికి ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ లేదు. ఆ ఇంటి పెద్దకొడుకు రాఘవేంద్ర అప్పుడే వచ్చి రాత్రి భోజనానికి కూర్చున్నాడు. భార్య వడ్డిస్తూ ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆవిడ కూడా ఒక్క మాటా మాట్లాడట్లేదు. రాఘవేంద్ర అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా, ఆ ఇంటి చిన్నకొడుకు వంశీ.. చేతిలో ఒక చిన్న బుక్ పట్టుకొని, రాఘవేంద్రకు చూపిస్తూ.. ‘‘ఏంటన్నయ్యా ఇదీ?’’ అనడిగాడు. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ అది. ఆ పాస్‌బుక్ బయటపడ్డ రోజునుంచే ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలే ఈ నిశ్శబ్దానికి కారణం. ‘‘ఇప్పుడే చెప్పాలా? భోంచేసి చెప్పొచ్చా?’’ అన్నాడు రాఘవేంద్ర. వంశీ ఏం మాట్లాడకుండా దూరం జరిగాడు. ‘‘ రాఘవేంద్ర గొంతు పెంచి గట్టిగా అడిగాడు – ‘‘ఎవరికి తెలియాలి? ఇంకా ఈ ఇంట్లో ఎవరెవరు తెలుసుకోవాలి?’’. ‘‘ఇక్కడ ఎవరికీ ఏదీ తెలియాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు భోంచెయ్యి..’’ అంటూ రాఘవేంద్ర తల్లి అందరినీ కోపంగా చూస్తూ మాట్లాడింది. ‘‘బుద్ధుందిరా నీకు? అన్నం ముందు కూర్చున్న వాడిని అడిగే మాటలా ఇవి?’’ ఆ వెంటనే వంశీని మందలించిందామె. ‘‘దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు..’’ అంటూ గట్టిగా చెప్పిందామె. ‘‘అవునన్నయ్యా! నువ్వెవ్వరికీ జవాబు చెప్పాల్సిన పన్లేదు.’’ అని కోపంగా అందరి దిక్కూ చూసి, ‘‘నువ్ ముందు భోంచెయ్యి అన్నయ్యా..’’ అన్నాడు విష్ణు. విష్ణు ఆ ఇంటికి రెండో కొడుకు. వాతావరణం కొద్దిసేపు చల్లబడింది. అందరూ ఒక్క మాట మాట్లాడకుండా రాఘవేంద్రను తినమన్నట్టు చూస్తున్నారు. రాఘవేంద్ర మళ్లీ భోజనం చేసేందుకు కూర్చున్నాడు. ఆయనలా కూర్చోవడమే, ‘‘ఎలాగూ విషయం ఇంత దూరం వచ్చిందిగా! అసలు సంగతేంటో అందరికీ చెప్పమనండి..’’ అంటూ గట్టిగా అరుస్తూ, విసురుగా మాట్లాడింది కళ్యాణి. కళ్యాణి విష్ణు భార్య. విష్ణు.. భార్య కళ్యాణిపై కోపంతో చెయ్యి చేసుకోబోయాడు. గొడవ మళ్లీ పెద్దదైంది. ‘‘అవును.. ఇప్పుడు నేనే రాద్దాంతం చేస్తున్నాను. నా ఖర్మ కాకపోతే ఆ పాస్‌బుక్ నా కంట్లోనే పడాలా? ఇంత జరిగినా దానిగురించి ఒక్కళ్లూ మాట్లాడరు?’’ అంది కళ్యాణి అదే కోపంతో, అంతే విసురుగా. రాఘవేంద్రకు ఏం మాట్లాడాలో, తాను ఎప్పట్నుంచో తన గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క ముద్దా తినకుండానే పళ్లెంలో అన్నం అలా ఉండగానే చెయ్యి కడిగి, లేచి పక్కకు వెళ్లిపోయాడు. ‘తినే పళ్లెం మీదనుంచి లేవకూడదయ్యా!’ అంటూ ఎవ్వరేం చెప్పినా నిపించుకోలేదు రాఘవేంద్ర. ‘‘రాఘవేంద్ర సూపర్‌మార్కెట్, రాఘవేంద్ర రైస్‌మిల్, రాఘవేంద్ర లారీ ట్రాన్స్పోర్ట్ అని చెవులకున్నవి మెళ్లో ఉన్నవి అన్నీ సుకుపోయారుగా..’’ కోపంతో ఊగిపోయి రాఘవేంద్రపై విరుచుకుపడింది కళ్యాణి. విష్ణు మరోసారి భార్యపైకి చెయ్యెత్తాడు. గొడవ ఇంకా పెద్దదైంది. ‘‘పెద్దబాబు! ఏవిట్రా ఇది.. బొమ్మలా నిలబడ్డావ్? ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్‌లో ఎందుకు దాచావో చెప్పరా?’’ ఏడుపు ఆపుకోలేక గట్టిగా రాఘవేంద్రను నిలదీసింది తల్లి.‘‘నోరు తెరిచి చెప్పరా! చెప్పూ..’’రాఘవేంద్ర అందరిదిక్కూ చూస్తూ ఏం మాట్లాడకుండా అలా నిలబడే ఉన్నాడు. ‘‘అందరూ నన్ను నిలదీస్తున్నారు. నలుగురు కొడుకులకు తండ్రివి. నువ్వడగవేం? నువ్వూ ఏదోకటి అడుగు..’’ తండ్రిని చూస్తూ బాధను దాచుకోలేక నోరు విప్పాడు రాఘవేంద్ర. ‘‘తట్టుకోలేర్రా! నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్లూ నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు..’’ అంటూ కన్నీళ్లు ఆపుకోలేక, గట్టిగా ఏడ్చేస్తూ చెప్పాడు రాఘవేంద్ర. రాఘవేంద్ర మాట్లాడుతూండగానే విష్ణు–కళ్యాణిల పదేళ్ల కూతురు శాంతి హాల్లో నురగలు కక్కుతూ కిందపడిపోయింది. ‘శాంతి.. శాంతి.. శాంతి..’ అంటూ ఇంట్లో అందరూ శాంతిని ఎత్తుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. శాంతి అకస్మాత్తుగా ఇలా జబ్బు పడడం ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. అప్పటికప్పుడు ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. రాఘవేంద్ర అందుకు అన్ని ఏర్పాట్లూ చేసి పెట్టాడు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి పాపకు నయమైంది. అప్పుడు గానీ ఆ ఇంట్లో గొడవకు కారణమైన బ్యాంక్ అకౌంట్ సంగతి బయటపడలేదు. ఆ అకౌంట్లో రాఘవేంద్ర పది లక్షల రూపాయలు దాచిపెట్టింది పాప ఆపరేషన్ కోసమే! విషయం తెలుసుకోగానే కళ్యాణి రాఘవేంద్రకు దగ్గరగా వెళ్లి, ఆయన కాళ్లపై పడి, ‘‘క్షమించు బావా..’’ అంటూ వేడుకుంది. ‘‘అమ్మా కళ్యాణి! ఏంటమ్మా ఇదీ!!’’ అంటూ కళ్యాణిని పైకి లేపాడు రాఘవేంద్ర.‘జరిగిందేంటో తెలుసుకోకుండా.. మీ మనసును చాలా బాధ పెట్టాను. నేను మిమ్మల్ని అనుమానిస్తే, మీరు నా బిడ్డకు ఆయుష్షు పోశారు..’’ అంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ రాఘవేంద్రను క్షమించమని వేడుకుంది కళ్యాణి. ‘‘ఊర్కోమ్మా! ఇప్పుడు బానే ఉందిగా!! రండి. పాపను చూద్దాం..’’ అంటూ పాప దగ్గరకు అందరినీ తీసుకెళ్లాడు రాఘవేంద్ర. ఆ ఇంట్లో అప్పటివరకూ ఉన్న నిశ్శబ్దమంతా బద్దలయింది అప్పుడే! మళ్లీ ఆ ఇంట్లో చిన్న చిన్న అలకలే తప్ప, గొడవంటూ జరగలేదు ఏరోజూ. దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు.. -
ఆ సత్తా ఉంది
తనకు గ్లామరస్‌గా నటంచగల సత్తా వుందని నటి సమంత తెలిపారు. సమంత ఇంతవరకు కుటుంబ కథా చిత్రాల్లోనే నటించారు. పాటల సన్నివేశాలలో అరకొర దుస్తులతో అభిమానులను అలరించారు. ఈ దృశ్యాలు ఇంటర్నెట్లోనూ విరివిగా పరుగులు తీస్తున్నాయి. పైగా ఈమె టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్నారు. సమంత నటించిన ప్రతి సినిమా హిట్టే అనే ప్రచారం టాలీవుడ్లో అధికంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ ఇటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతంగా గ్లామరస్‌గా మారుతోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడకుండా సిద్ధం అంటోంది. తాను ఎలాంటి పాత్రకైనా నప్పుతానని నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెబుతోంది. మరి ఇంతకీ గ్లామరస్‌గా మారడానికి కారణమేమిటని కొందరు ప్రశ్నించగా ఆమె బదులిచ్చారు. ఇప్పటివరకు తాను ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లోనే నటించానని, అవన్నీ హిట్ కావడంతో, కుటుంబ కథా చిత్రాల్లో మాత్రమే తాను నటించగలనని, గ్లామర్ పాత్రలకు తాను సరిపడనని కొందరు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అభిప్రాయం సరికాదని, కుటుంబ కథా చిత్రాల ఇమేజ్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో అంజాన్ చిత్రంలో గ్లామరస్‌గా కనిపించానని తెలిపారు. అందుకే చిట్టి పొట్టి దుస్తులు ధరించడానికి సంకోచించలేదని స్పష్టం చేశారు. తాను కూడా గ్లామరస్‌గా కనిపించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించానన్నారు. గ్లామరస్‌గా కనిపించడం సులభం కాదని, ఈ సందర్భంగా అటువంటి పాత్ర ల్లో నటించే తారలందరికీ హేట్సాఫ్ తెలుపుతున్నానన్నారు.


