తట్టుకోలేర్రా!!

Family Drama in Telugu Cinema - Sakshi

తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా అన్నది ఎవర్‌గ్రీన్‌ జానర్‌. ఈ జానర్లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమాలకు లెక్కేలేదు. అలాంటి ఓ సూపర్‌హిట్‌ సినిమాలోని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?

ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. అంత నిశ్శబ్దాన్ని భరించే శక్తి కూడా అప్పటికి ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ లేదు. 

ఆ ఇంటి పెద్దకొడుకు రాఘవేంద్ర అప్పుడే వచ్చి రాత్రి భోజనానికి కూర్చున్నాడు. భార్య వడ్డిస్తూ ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆవిడ కూడా ఒక్క మాటా మాట్లాడట్లేదు. 

రాఘవేంద్ర అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా, ఆ ఇంటి చిన్నకొడుకు వంశీ.. చేతిలో ఒక చిన్న బుక్‌ పట్టుకొని, రాఘవేంద్రకు చూపిస్తూ.. ‘‘ఏంటన్నయ్యా ఇదీ?’’ అనడిగాడు. బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌ అది. ఆ పాస్‌బుక్‌ బయటపడ్డ రోజునుంచే ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలే ఈ నిశ్శబ్దానికి కారణం. 

‘‘ఇప్పుడే చెప్పాలా? భోంచేసి చెప్పొచ్చా?’’ అన్నాడు రాఘవేంద్ర. వంశీ ఏం మాట్లాడకుండా దూరం జరిగాడు. 

‘‘ రాఘవేంద్ర గొంతు పెంచి గట్టిగా అడిగాడు – ‘‘ఎవరికి తెలియాలి? ఇంకా ఈ ఇంట్లో ఎవరెవరు తెలుసుకోవాలి?’’.

‘‘ఇక్కడ ఎవరికీ ఏదీ తెలియాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు భోంచెయ్యి..’’ అంటూ రాఘవేంద్ర తల్లి అందరినీ కోపంగా చూస్తూ మాట్లాడింది. 

‘‘బుద్ధుందిరా నీకు? అన్నం ముందు కూర్చున్న వాడిని అడిగే మాటలా ఇవి?’’ ఆ వెంటనే వంశీని మందలించిందామె. 

‘‘దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు..’’ అంటూ గట్టిగా చెప్పిందామె. 

‘‘అవునన్నయ్యా! నువ్వెవ్వరికీ జవాబు చెప్పాల్సిన పన్లేదు.’’ అని కోపంగా అందరి దిక్కూ చూసి, ‘‘నువ్‌ ముందు భోంచెయ్యి అన్నయ్యా..’’ అన్నాడు విష్ణు. విష్ణు ఆ ఇంటికి రెండో కొడుకు. 

వాతావరణం కొద్దిసేపు చల్లబడింది. అందరూ ఒక్క మాట మాట్లాడకుండా రాఘవేంద్రను తినమన్నట్టు చూస్తున్నారు. రాఘవేంద్ర మళ్లీ భోజనం చేసేందుకు కూర్చున్నాడు. ఆయనలా కూర్చోవడమే, ‘‘ఎలాగూ విషయం ఇంత దూరం వచ్చిందిగా! అసలు సంగతేంటో అందరికీ చెప్పమనండి..’’ అంటూ గట్టిగా అరుస్తూ, విసురుగా మాట్లాడింది కళ్యాణి. కళ్యాణి విష్ణు భార్య. విష్ణు.. భార్య కళ్యాణిపై కోపంతో చెయ్యి చేసుకోబోయాడు. గొడవ మళ్లీ పెద్దదైంది. ‘‘అవును.. ఇప్పుడు నేనే రాద్దాంతం చేస్తున్నాను. నా ఖర్మ కాకపోతే ఆ పాస్‌బుక్‌ నా కంట్లోనే పడాలా? ఇంత జరిగినా దానిగురించి ఒక్కళ్లూ మాట్లాడరు?’’ అంది కళ్యాణి అదే కోపంతో, అంతే విసురుగా. 

రాఘవేంద్రకు ఏం మాట్లాడాలో, తాను ఎప్పట్నుంచో తన గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క ముద్దా తినకుండానే పళ్లెంలో అన్నం అలా ఉండగానే చెయ్యి కడిగి, లేచి పక్కకు వెళ్లిపోయాడు. ‘తినే పళ్లెం మీదనుంచి లేవకూడదయ్యా!’ అంటూ ఎవ్వరేం చెప్పినా నిపించుకోలేదు రాఘవేంద్ర. ‘‘రాఘవేంద్ర సూపర్‌మార్కెట్, రాఘవేంద్ర రైస్‌మిల్, రాఘవేంద్ర లారీ ట్రాన్స్‌పోర్ట్‌ అని చెవులకున్నవి మెళ్లో ఉన్నవి అన్నీ సుకుపోయారుగా..’’ కోపంతో ఊగిపోయి రాఘవేంద్రపై విరుచుకుపడింది కళ్యాణి. విష్ణు మరోసారి భార్యపైకి చెయ్యెత్తాడు. గొడవ ఇంకా పెద్దదైంది.

‘‘పెద్దబాబు! ఏవిట్రా ఇది.. బొమ్మలా నిలబడ్డావ్‌? ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్‌లో ఎందుకు దాచావో చెప్పరా?’’ ఏడుపు ఆపుకోలేక గట్టిగా రాఘవేంద్రను నిలదీసింది తల్లి.‘‘నోరు తెరిచి చెప్పరా! చెప్పూ..’’రాఘవేంద్ర అందరిదిక్కూ చూస్తూ ఏం మాట్లాడకుండా అలా నిలబడే ఉన్నాడు. ‘‘అందరూ నన్ను నిలదీస్తున్నారు. నలుగురు కొడుకులకు తండ్రివి. నువ్వడగవేం? నువ్వూ ఏదోకటి అడుగు..’’ తండ్రిని చూస్తూ బాధను దాచుకోలేక నోరు విప్పాడు రాఘవేంద్ర. ‘‘తట్టుకోలేర్రా! నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్లూ నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు..’’ అంటూ కన్నీళ్లు ఆపుకోలేక, గట్టిగా ఏడ్చేస్తూ చెప్పాడు రాఘవేంద్ర. రాఘవేంద్ర మాట్లాడుతూండగానే విష్ణు–కళ్యాణిల పదేళ్ల కూతురు శాంతి హాల్లో నురగలు కక్కుతూ కిందపడిపోయింది. 

‘శాంతి.. శాంతి.. శాంతి..’ అంటూ ఇంట్లో అందరూ శాంతిని ఎత్తుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. శాంతి అకస్మాత్తుగా ఇలా జబ్బు పడడం ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. అప్పటికప్పుడు ఆపరేషన్‌ చెయ్యాలన్నారు డాక్టర్లు. రాఘవేంద్ర అందుకు అన్ని ఏర్పాట్లూ చేసి పెట్టాడు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయి పాపకు నయమైంది. అప్పుడు గానీ ఆ ఇంట్లో గొడవకు కారణమైన బ్యాంక్‌ అకౌంట్‌ సంగతి బయటపడలేదు. ఆ అకౌంట్‌లో రాఘవేంద్ర పది లక్షల రూపాయలు దాచిపెట్టింది పాప ఆపరేషన్‌ కోసమే! విషయం తెలుసుకోగానే కళ్యాణి రాఘవేంద్రకు దగ్గరగా వెళ్లి, ఆయన కాళ్లపై పడి, ‘‘క్షమించు బావా..’’ అంటూ వేడుకుంది. 

‘‘అమ్మా కళ్యాణి! ఏంటమ్మా ఇదీ!!’’ అంటూ కళ్యాణిని పైకి లేపాడు రాఘవేంద్ర.‘జరిగిందేంటో తెలుసుకోకుండా.. మీ మనసును చాలా బాధ పెట్టాను. నేను మిమ్మల్ని అనుమానిస్తే, మీరు నా బిడ్డకు ఆయుష్షు పోశారు..’’ అంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ రాఘవేంద్రను క్షమించమని వేడుకుంది కళ్యాణి. ‘‘ఊర్కోమ్మా! ఇప్పుడు బానే ఉందిగా!! రండి. పాపను చూద్దాం..’’ అంటూ పాప దగ్గరకు అందరినీ తీసుకెళ్లాడు రాఘవేంద్ర. ఆ ఇంట్లో అప్పటివరకూ ఉన్న నిశ్శబ్దమంతా బద్దలయింది అప్పుడే! మళ్లీ ఆ ఇంట్లో చిన్న చిన్న అలకలే తప్ప, గొడవంటూ జరగలేదు ఏరోజూ. దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top