ఈ రోజు (నవంబరు 21) బోలెడన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఒకటి 'ఇట్లు మీ ఎదవ'. త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రంలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది. బళ్లారి శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మచిలీపట్నంలో శ్రీను (త్రినాథ్).. ఆరేళ్లుగా పీజీ చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్ల పాటు తిరిగి ఆమె కూడా తన ప్రేమలో పడేలా చేస్తాడు. ఎప్పుడూ ఎదవలా తిరిగే కొడుకు బాగుపడుతున్నాడే అనుకుని.. మనస్విని ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి శ్రీను తండ్రి వెళ్తారు. ఇలాంటి ఎదవకు పిల్లనిస్తారా అని తిట్టి పంపేస్తారు. దీని గురించి మాట్లాడేందుకు శ్రీను, మనస్విని ఇంటికి వెళ్లగా.. ఓ చిన్న సంఘటన జరిగి శ్రీను, తన ప్రియురాలి తండ్రితో నెలరోజుల పాటు ఉండాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైంది? శ్రీను చివరకు మంచోడు అనిపించుకున్నాడా? ఎదవ అనిపించుకున్నాడా? అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఆవారాగా తిరిగే హీరో.. కాలేజీలో హీరోయిన్‌తో ప్రేమలో పడటం.. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రితో హీరో ఓ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి రావడం.. చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. తొలి భాగమంతా రొటీన్ లవ్ సీన్స్, కాలేజీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు అతికించినట్లు అనిపిస్తాయి. శ్రీను, మనుల ప్రేమ ఇంట్లో తెలిసిన తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి 30 రోజుల ఛాలెంజ్ అని పడుతుంది. అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ వాళ్ల నాన్న సీన్స్ ఎక్కువగా ఉంటాయి. నాన్న, బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోయేలా హీరోయిన్ సీన్స్ ఉంటాయి. కామెడీ ఓకే ఓకే. ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కథని అప్పటివరకు చూపించిన దానికి కాస్త భిన్నంగా రాసుకున్నాడు.
ఎలా చేశారు?
హీరో కమ్ దర్శకుడు త్రినాథ్ బాగా చేశాడు. హీరోయిన్ సాహితీ క్యూట్‌గా బాగుంది. గోపరాజు రమణ, దేవీప్రసాద్ తండ్రి పాత్రల్లో ఆకట్టుకున్నారు. తనికెళ్ల భరణి అతిథి పాత్రలో అలా మెరిశారు. మిగిలిన నటీనటులు తమ ఫరిది మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్పీ పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ పాత సినిమాల స్టైల్లో వినిపించింది. పాటలు వినడానికి ఓకే అనిపించాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5


