టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది | MTV Closed Music Channel Permanently | Sakshi
Sakshi News home page

టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది

Jan 6 2026 7:46 PM | Updated on Jan 6 2026 8:01 PM

MTV Closed Music Channel Permanently

టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్‌టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్‌ జాక్సన్‌ లాంటి పాప్‌ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!

1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్‌ కల్చర్‌ వరకు మైఖేల్‌ జాక్సన్‌ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్‌... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్‌, ఎంటీవీ 80స్‌, 90స్‌, క్లబ్‌ ఎంటీవీ, ఎంటీవీ లైవ్‌ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్‌ ది రేడియో స్టార్‌" అనే పాటనే.. 2025 డిసెంబర్‌ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్‌ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.

ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్‌తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్‌ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్‌మెంట్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.

ఎంటీవీ ఛానెల్‌కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు

  • 1981లో అప్పటి వరకు మ్యూజిక్‌ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.

  • 1983లో థ్రిల్లర్‌ ఆల్బమ్‌లోని బిల్లీ జీన్‌, బీట్‌ ఇట్‌ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్‌స్టార్‌గా మారాడు.

  • 1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్‌ అవార్డ్స్‌ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.

  • 1985లో ఎంటీవీని వయాకామ్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.

  • 1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్‌గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్‌ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.

  • 1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.

  • 2000లో రియాల్టీ షోస్‌ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్‌, లాగునా బీచ్‌, ది హిల్స్‌ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్‌గా మార్చాయి.

  • 2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్‌ ది రేడియో స్టార్‌'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement