
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్‌లో.. తర్వాత సీరియల్స్‌లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు.
నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిది
జై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్‌గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు.

అమ్మకు అన్యాయం
ఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్‌లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్‌లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!
అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..
అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.
కష్టాలతో సావాసం
మరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
చదవండి: ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?