Slum Dog Husband Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Slum Dog Husband Review: కుక్కతో పెళ్లి.. తర్వాత ఏం జరిగింది?

Published Sat, Jul 29 2023 1:07 PM

Slum Dog Husband Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌
నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి 
నిర్మాణ సంస్థ:మైక్ మూవీస్ 
దర్శకత్వం: ఏఆర్‌ శ్రీధర్‌ 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
విడుదల తేది: జులై 29, 2023

కథేంటంటే.. 
హైదరాబాద్‌లోని పార్శీగుట్టకు చెందిన లక్ష్మణ్‌ అలియాస్‌ లచ్చి(సంజయ్‌ రావు), మౌనిక(ప్రణవి మానుకొండ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే... ఇద్దరి జాతకాలు ఉండవు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే ఇరు కుటుంబాలలో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతాడు పంతులు. ఈ గండం పోవాలంటే లచ్చి ముందుగా ఓ కుక్కను లేదా చెట్టును పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు.

స్నేహితుడు సంతోష్‌(యాదమ్మ రాజు)సలహాతో లచ్చి ఓ కుక్క(బేబీ)ని పెళ్లి చేసుకుంటాడు. వారం రోజుల తర్వాత ప్రియురాలు మౌనికతో పెళ్లి జరుగుతుండగా పోలీసులు లచ్చిని అరెస్ట్‌ చేస్తారు. బేబీ(కుక్క) ఓనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. బేబీతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం నేరమని, విడాకుల కోసం రూ.20లక్షలు భరణంగా ఇవ్వాలని కుక్క ఓనర్‌ డిమాండ్‌ చేస్తారు. ఈ కేసు కోర్టుకెక్కుతుంది. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు? బేబీ ఓనర్‌ ఎందుకు రూ.20లక్షలు డిమాండ్‌ చేస్తాడు? మౌనికతో లచ్చి పెళ్లి జరిగిందా లేదా?  బేబీతో లచ్చి ఎలా ప్రేమలో పడ్డాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
కుక్కతో పెళ్లి.. ఇది వినడానికే కాస్త వింతగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు మనం టీవీల్లో చూస్తుంటాం. జంతువులపై ప్రేమతోనో లేదా దోషం పోవాలనో కొంతమంది ఇలాంటి వింత పనులు చేస్తుంటారు. అదే పాయింట్‌ని కథగా మలిచి స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీధర్‌. మూఢనమ్మకంతో ఓ కుక్కను పెళ్లి చేసుకున్నాక..అతనికి ఏర్పడిన ఇబ్బందులు ఏంటనేది కామెడీగా చూపిస్తూనే..అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. నా అనుకున్నవారే అవసరాన్ని బట్టి మోసం చేస్తుంటారు. కానీ జంతువులకు అలాంటివేవి తెలియదు. ఒక్కపూట తిండి పెడితే చాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయని అనేది ఈ సినిమాలో చూపించారు.  

బస్తీకి చెందిన లచ్చి తన ప్రియురాలు మౌనికతో ఫోన్‌లో సెక్సీ స్పీకింగ్‌ చేస్తున్న సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కూడా కాసేపు ఆ తరహా సన్నివేశాలే ఉంటాయి.ఇవి యాత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.  ఇక కుక్కతో పెళ్లి కాస్సెప్ట్‌ ప్రారంభమై తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే కుక్కతో పెళ్లి జరిగే వరకు కాస్త ఎంటర్‌టైనింగ్‌ సాగుతుంది.

ఆ తర్వాత కథ కోర్టు చుట్టు తిరుగుతుంది. కోర్డు రూమ్‌ సీన్స్‌ ఫేలవంగా ఉంటాయి. కామెడీ పండించడానికి ఆస్కారం ఉన్నా..దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కుక్కకు ‘వెన్నెల’కిశోర్‌ వాయిస్‌ పెట్టడం..దాని వెనుక సీక్రెట్‌ని రివీల్‌ చేసే సీన్స్‌ అంతగా ఆకట్టుకోలేవు. కోర్టులో జంతువుల విశ్వాసం గురించి చెప్పే సీన్స్‌ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు రొమాంటిక్‌ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ కామెడీపై కూడా పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
బస్తీకి చెందిన లచ్చి అలియాస్‌ లక్ష్మణ్‌గా సంజయ్‌ రావు జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక మౌనికగా  ప్రణవి మానుకొండ అదరగొట్టేసేంది. ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ చేయకుండానే తనదైన నటన, మాటలతో యువతకు మత్తెకించేసింది. ఈ సినిమాలో యాదమ్మ రాజుకు మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు సంతోష్‌గా యాదమ్‌ రాజు కామెడీ సినిమాకు ప్లస్‌. అంతేకాదు క్లైమాక్స్‌ అతని పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ కూడా బాగుంటుంది. 

కుక్క ఓనర్‌గా నటించిన వేణు కొలసాని తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో అందరికి గుర్తిండిపోయేలా చేశాడు. ఇక లాయర్లుగా బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భీమ్స్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌. 'లచ్చి గాని పెళ్లి' సాంగ్‌ థియేటర్స్‌లో విజిల్స్‌ వేయిస్తుంది. రెట్రోసాంగ్‌తో పాటు మిగతావి కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 

తప్పక చదవండి

Advertisement