
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్‌బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.
తాజాగా అన్‌బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్‌బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.
గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్‌లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.