అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్‌ | Sakshi
Sakshi News home page

‘పుష్ప పుష్ప..’ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ : దీపక్‌ బ్లూ

Published Thu, May 23 2024 10:01 AM

Singer Deepak Blue Talks About Pushpa Pushpa Song

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. కాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ‘పుష్ప పుష్ప’ లిరికల్‌ వీడియో ఈ నెల 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైంది. 

ఈ పాట తెలుగు, తమిళ వెర్షన్స్‌లోని కొంత భాగాన్ని ఆలపించిన సింగర్‌ దీపక్‌ బ్లూ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం చెన్నై. మా నాన్నగారు కొంతకాలం రేపల్లెలో ఉన్నారు. అలా నాకు తెలుగు భాషపై అవగాహన ఉంది. మా అమ్మమ్మ, మా అమ్మగార్లకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అలా సంగీతంపై నాకు ఆసక్తి కలిగింది. మైక్రోబయాలజీలో పీజీ చదివాను. కొంతకాలం ఉద్యోగం చేస్తూనే, సింగర్‌గా ఉన్నాను. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి సింగర్‌గా బిజీ అయ్యా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు మూడొందలకు పైగా పాటలు  పాడాను. విజయ్‌ ఆంటోనీగారి ‘నాన్‌’ సినిమాలో తొలి పాడాను. తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ చిత్రంలో ‘బాయ్‌ బాయ్‌’ పాడాను. తెలుగులో అదే నా తొలి పాట. ఆ తర్వాత ‘బీరువా, పండగ చేస్కో, కిక్‌ 2, చుట్టాలబ్బాయి, డిక్టేటర్, ఇటీవల ‘వారసుడు’ చిత్రాల్లో పాటలు పాడాను. కానీ ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రంలోని ‘లవ్‌ దెబ్బ’, రామ్‌చరణ్‌ ‘బ్రూస్‌లీ’లోని ‘మెగా మీటర్‌’ పాటలు గుర్తింపు తీసుకువచ్చాయి. 

ఇక ‘పుష్ప’లోని ‘హే బిడ్డ..’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ చిన్న వాయిస్‌ ఇచ్చాను. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ సినిమా టైటిల్‌ సాంగ్‌ ‘పుష్ప పుష్ప’ పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాట నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా భావిస్తున్నాను. నాకు చాలా మంది సింగర్స్‌ స్ఫూర్తి. ఎస్పీబీగారు ప్రేరణ’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పేరు దీపక్‌. కానీ దీపక్‌ పేరుతో చాలామంది సింగర్స్‌ ఉన్నారు. నా ఫేవరెట్‌ కలర్‌ బ్లూ. అలా నా పేరుకి బ్లూ చేర్చుకున్నాను’’ అన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement