
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ మూవీ అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రేమ కథను పంచుకున్నారు. ‘తెలుసు కదా’ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు.
ఇద్దరిని ప్రేమించిన ఓ యువకుడి స్టోరీతో తెలుసు కదా చిత్రం తెరకెక్కింది. అయితే, తన నిజ జీవితంలోని ప్రేమకథను కూడా సిద్ధు జొన్నలగడ్డ ఇలా పంచుకున్నారు. 'నేను ఏడో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. కానీ, ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇంతలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. చివరి రోజున శ్లామ్ బుక్ తీసుకొని తన వద్దకు వెళ్లాను. ఒక కొటేషన్‌తో పాటు తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా అందులో రాసింది. చివరిసారిగా నా నుంచి వెళ్తూ.. ఓ లుక్ ఇచ్చి సైకిల్‌పై వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ సీన్ నా కళ్ల ముందే తిరుగుతుంది. కానీ, ఆ తర్వాత కూడా ఎప్పుడూ నా ప్రేమ విషయాన్ని ఆమెతో పంచుకోలేదు. కొన్నేళ్ల తర్వాత తనకు పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారని తెలిసింది. ఆమెతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ అప్పుడప్పుడు చూస్తుంటాను.' అని సిద్ధు చెప్పాడు.