కొత్త సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు హీరో శర్వానంద్ (Sharwanand). ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బైకర్. అథ్లెట్‌గా కనిపించేందుకు డైట్, జిమ్ చేసిన శర్వా.. సన్నగా మారిపోయాడు. ఇటీవలే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. శర్వా ఇంత బక్కచిక్కిపోయాడేంటి? అని అభిమానులే ఆశ్చర్యపోయారు. అయితే ఒకప్పుడు జిమ్‌కు వెళ్లని శర్వా.. సడన్‌గా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి కూతురే కారణమని చెప్తున్నాడు.
అప్పుడే డిసైడయ్యా..
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని నా కూతురు పుట్టాకే తెలిసొచ్చింది. అంతకుముందు నా జీవితంలో వర్కవుట్స్ చేసింది లేదు. నా కూతురు పుట్టాక ఆత్మపరిశీలన చేసుకున్నా.. నా శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యంగా ఉండటం అనేది నా లక్ష్యం కాదు, అది ఒక జీవన విధానం. నా కుటుంబం కోసం నేను ధృడంగా ఉండాలి. ఇదొక్కటే మనసులో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది.
ఆలస్యంగా తెలుసుకున్నా..
2019లో నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నా చేతికి సర్జరీ అయింది. యాంటిబయాటిక్స్ వాడటం వల్ల ఎప్పుడూ ఆకలేసేది. ఫలితంగా విపరీతంగా బరువు పెరిగాను. 92 కిలోలకు వచ్చాను. నేను ఎంత మారిపోయాననేది చాలా ఆలస్యంగా అర్థమైంది. యాక్టివ్‌గా ఉండేందుకు రెండేళ్ల క్రితం నడక ప్రారంభించాను, ఇప్పుడిలా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. శర్వానంద్.. 2023లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రక్షితను పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీరికి కూతురు పుట్టింది. ఆమెకు లీలా దేవి మైనేని అని నామకరణం చేశారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా శర్వా దంపతులు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో శర్వా.. కుటుంబం కోసం స్ట్రాంగ్‌గా ఉంటానని కామెంట్ చేయడంతో ఈ విడాకుల రూమర్స్‌కు చెక్ పడుతుందేమో చూడాలి!
చదవండి: మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం


