గతేడాది సంక్రాంతికి మనమేతో హిట్టు కొట్టాడు హీరో శర్వానంద్. ఈసారి నారీ నారీ నడుమ మురారి మూవీతో మరోసారి సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. ఈ యేడు సంక్రాంతి బరిలో నాలుగైదు సినిమాలున్నప్పటికీ వాటి పోటీని తట్టుకుంటూ మళ్లీ హిట్టందుకున్నాడు.
ఎమోషనల్ స్పీచ్
ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి విన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ.. నిర్మాత అనిల్ సుంకర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి.. చాలా మంచి వ్యక్తి అని చెప్తారు. ఒక అన్నగా అండగా నిల్చున్నారు. ఈ సినిమాను ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు.
అలా ఎప్పుడూ అనుకోకు
ఆయన గురించి ఓ విషయం చెప్పాలి. మహాసముద్రం సినిమా పోయాక నేను ఫోన్ చేసి సారీ చెప్పాను. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నేను కూడా కొంచెం ఫిట్‌గా ఉండుంటే బాగుండేదన్నాను. అందుకాయన ఛీఛీ శర్వా.. అలా ఎప్పుడూ అనుకోకు. ఇది అందరమూ కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి అందరమూ బ్లేమ్ తీసుకోవాలి అన్నాడు. అందరం కలిసి తప్పు చేశాం.. అందరం భరిద్దాం అన్నాడు.
ఇంతవరకు చూడలేదు
అలా ఒక నిర్మాత చెప్పడం నేనింతవరకు చూడలేదు. నీవల్ల నాకు డబ్బులు పోయాయని ఇంతవరకు అనలేదు. థాంక్యూ అనిల్‌గారు. మీ బ్యానర్ కోసం నేనెప్పుడూ రెడీగా ఉంటాను అని ఎమోషనలయ్యాడు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన మహాసముద్రం 2021లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించాడు.


