
'సారంగపాణి జాతకం' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా తన జాతకం చూసుకోనుంది.
ప్రియదర్శికి ఈ సినిమా మరింత గుర్తింపును తెచ్చింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే 'సారంగపాణి జాతకం' అని చెప్పవచ్చు. మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. థియేటర్‌లో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో కాస్త ఆసక్తిని కలిగించే అంశం అని చెప్పవచ్చు. కథలో అనవసరమై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేర్చకుండా మంచి కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. అయితే, స్టోరీని ముందే అంచనా వేసేలా ఉండటంతో ఆశించినంత విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు.

సారంగపాణి జాతకం కథ ఇదే
సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు.
ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్‌తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.