కోలివుడ్‌లో సంచలన కథానాయకుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. మంచి విజయాన్ని అందుకుని చాలాకాలమైంనే చెప్పాలి. ఇటీవల కమలహాసన్‌తో కలసి నటించిన థగ్స్ లైఫ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది ఉత్తర చెన్నై యూనివర్సల్‌లో సాగే ఒక కథతో రూపొందుతున్న చిత్రమని యూనిట్ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి.

కాగా మదురైకి చెందిన ఒక సాధారణ కబడ్డీ క్రీడాకారుడు అనూహ్య పరిస్థితుల్లో చెన్నైకి రావడం, ఆ తర్వాత అక్కడ ఒక డానుగా మారడం వంటి కథాంశంతో సాగే చిత్రం అరసన్ అని సమాచారం. దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది కావడం గమనార్హం. ఇందులో శింబు యువకుడిగా, మధ్య వయసు్కడిగాను రెండు గెటప్పుల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయ్ సేతుపతి పోషించనున్నారు. దీంతో ఇది మల్టీ స్టారర్ చిత్రంగా మారుతోంది.
తాజాగా ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయకిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇంతకుముందు విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, వంటి స్టార్ హీరోల సరసన నటించిన సమంత తమిళంలో నటించి కూడా చాలాకాలమైంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం.


