
ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు సల్మాన్ ఖాన్. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫలానా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని, ఫలానా అమ్మాయితో సల్మాన్ పెళ్లి అని చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ సల్మాన్ మాత్రం ఏ అమ్మాయితోనూ ఏడడుగులు వేయలేదు. అయితే భవిష్యత్‌లో మాత్రం తనకు పిల్లలు కావాలని చెబుతున్నారు సల్మాన్ ఖాన్. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో’లో ఆమిర్ ఖాన్‌తో కలిసి సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ షోలో సల్మాన్ ఖాన్ పెళ్లి, ప్రేమ అంశాల ప్రస్తావనను తీసుకువచ్చారు ట్వింకిల్.
గతంలో కాఫీ విత్ కరణ్ షోలో సల్మాన్ ఖాన్ తనను తాను నవమన్మథుడిగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ట్వింకిల్ ప్రస్తావిస్తూ, సల్మాన్‌కు డజనుమంది పిల్లలు ఉండి ఉండొచ్చని, వాళ్ల గురించి మనకు తెలియదని, ఈ విషయం సల్మాన్‌కు కూడా తెలియదన్నట్లుగా కాస్త చమత్కారంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందిస్తూ– ‘‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ నాకు పిల్లలు ఉంటే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?’’ అని పేర్కొన్నారు సల్మాన్.
ఆ తర్వాత పిల్లల్ని దత్తత తీసుకునే చాన్స్ ఏమైనా ఉందా? అని సల్మాన్‌ను ట్వింకిల్ ప్రశ్నించగా, ‘‘దత్తత తీసుకునే ఆలోచన అయితే లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించి చెప్పలేం. అంతా దేవుడి దయ. నాకు పిల్లలు పుడితే వారి ఆలనా పాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది. అయాన్ (సల్మాన్ మేనల్లుడు), అలీజ్ ( మేనకోడలు)లు ఉన్నారు. వీరు పెద్దవాళ్లు అయ్యారు. అంతా ఇంట్లోవాళ్లే చూసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూటింగ్‌తో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు.