గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్‌కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)
టీజర్‌లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్‌ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్‌తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే)


