కాలానికి కరిగిపోని ‘వివేక్‌’ నవ్వు

Sakshi Special Story About Veteran Tamil actor and comedian Vivek

వివేకం + ఆనందం = వివేకానందం. సార్థక నామధేయుడు – ప్రసిద్ధ తమిళ నటుడు ‘వివేకానందన్‌’ అలియాస్‌ వివేక్‌.

చేసింది హాస్యపాత్రలే అయినప్పటికీ వివేకవంతమైన సంభాషణలతో విజ్ఞానాన్నీ, హాస్యసంభాషణలతో ఆనందాన్నీ పంచారు వివేక్‌. ప్రముఖ తమిళ హాస్య, సహాయ నటుడు వివేకానందన్‌ (వివేక్‌) శనివారం తుది శ్వాస విడిచారు. శుక్రవారం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. శనివారం తెల్లవారుజామున 4.35 గంటలకు వివేక్‌ (59) కన్నుమూశారు. తమిళనాడులోని కోవిల్‌పట్టిలో 1961 నవంబర్‌ 19న జన్మించాడు. దిండిగల్‌లో టెలిఫోన్స్‌ శాఖలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా శిక్షణ పొందారు. చెన్నైలో సెక్రటేరియట్‌లో పనిచేస్తూ, ‘మద్రాస్‌ హ్యూమర్‌ క్లబ్‌’లో ‘స్టాండప్‌ కమెడియన్‌’గా చేసేవారు. క్లబ్‌ వ్యవస్థాపకుడు గోవిందరాజన్‌ ద్వారా దర్శకుడు కె. బాలచందర్‌తో వివేక్‌కి పరిచయం ఏర్పడింది.

రచన టు నటన... బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా చేయడం మొదలుపెట్టారు వివేక్‌. ఒకరోజు ఒక సందర్భాన్ని వివరించి, పదహారు పాత్రలతో కథ రాయమన్నారు బాలచందర్‌. ఒకే ఒక్క రాత్రిలో వివేక్‌ రాసిచ్చారు. ‘మనదిల్‌ ఉరుది వేండుమ్‌’ (1987) చిత్రానికి స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు చిత్రదర్శకుడు బాలచందర్‌ వివేక్‌కి మంచి పాత్ర ఇచ్చారు. తొలిరోజు షూట్‌లో వివేక్‌ మెట్లపై నుంచి వేగంగా కిందకు దిగాలి. బాలచందర్‌ తృప్తిగా కట్‌ చెప్పేవరకూ మెట్లు దిగారు. ఫలితంగా కాలి వేళ్లకు గాయమైంది. కానీ బాలచందర్‌ దగ్గర చెప్పలేదు. విషయం తెలిసి, ఆయన  చికిత్స చేయించుకోమన్నారు. నటుడిగా తొలి సీన్లో మెట్లు దిగిన వివేక్‌ ఆ తర్వాత కెరీర్‌లో ఎన్నో మెట్లు ఎక్కారు!

విజ్ఞానం పంచిన నటుడు... బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘పుదు పుదు అర్థంగళ్‌’, ‘ఒరు వీడు – ఇరు వాసల్‌’ వంటి చిత్రాల్లోనూ వివేక్‌ మంచి పాత్రలు చేశారు. ‘పుదు పుదు అర్థంగళ్‌’లో ‘ఇన్నిక్కు సత్తా... నాళైక్కు పాల్‌’ (ఇవాళ చచ్చిపోతే... రేపటికి రెండు) అని పదే పదే అంటుంటారు వివేక్‌. అర్థవంతమైన ఈ డైలాగ్‌ని వివేక్‌ నవ్వు తెప్పించేట్లు పలికారు. ఆ మాటకొస్తే... ఇలాంటి డైలాగులు చాలానే చెప్పారు.  ‘వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలి. మనుషుల మనసుల్లో ఉండకూడదు రా’, ‘మిమ్మల్ని మార్చాలంటే ఎంతమంది పెరియార్లు వచ్చినా కుదరదు’, ‘ఇక్కడ డబ్బులు ఇవ్వనిదే పనులు జరగవు శివాజీ’ వంటి ఆయన డైలాగులు వివిధ తమిళ చిత్రాల్లో నవ్వించాయి... ఆలోచింపజేశాయి. అందుకే నవ్వులు మాత్రమే కాదు.. విజ్ఞానం పంచిన నటుడు కూడా!

అది వివేక్‌ సీజన్‌...
1990ల మధ్య నుంచి ఓ పదేళ్లకు పైగా తమిళ పరిశ్రమలో కామెడీ పరంగా ‘వివేక్‌ సీజన్‌’ అని చెప్పాలి. అప్పట్లో వివేక్‌ లేని తమిళ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ‘సొల్లి అడిప్పేన్‌’ (2004) హీరోగా వివేక్‌కి తొలి తమిళ చిత్రం. ఆ తర్వాత విక్రమ్‌తో శంకర్‌ తీసిన ‘అన్నియన్‌’ (అపరిచితుడు)లో అండర్‌కవర్‌ పోలీసాఫీసర్‌గా వివేక్‌ చేసిన పాత్ర ఆకట్టుకుంది. రజనీకాంత్, కమలహాసన్‌ దగ్గర నుంచి మాధవన్, అజిత్, ఇవాళ్టి హీరోలు విజయ్, ధనుష్‌ దాకా తమిళ స్టార్లందరితోనూ ఆయన నటించారు. రజనీకాంత్‌ ‘శివాజీ’, మాధవన్‌తో ‘అలైపాయుదే’ (‘సఖి’), ‘మిన్నలే’ (‘చెలి’), ధనుశ్‌ ‘వీఐపీ’ (‘రఘువరన్‌ బీటెక్‌’) లాంటి చిత్రాల్లో వివేక్‌ పండించిన హాస్యం మరచిపోలేనిది. అలాగే వివేక్‌ ‘నాన్‌దాన్‌ బాలా’, ‘పాలగాట్టు మాధవన్‌’, ‘వెళ్లై పూక్కళ్‌’ వంటి చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌ చేశారు.
తెరపై నవ్వు... తెరవెనక దుఃఖం... తెరపై నవ్వులు పంచిన వివేక్‌ జీవితంలో జరిగిన పెద్ద విషాదం ఆయన తనయుడు ప్రసన్నకుమార్‌ 13 ఏళ్ల వయసులో మెదడు వాపు వ్యాధితో మరణించడం! 2016లో ప్రసన్నకుమార్‌ చనిపోయాక వివేక్‌ కుంగిపోయారు. వివేక్‌కు భార్య అరుళ్‌ సెల్వి, ఇద్దరు కుమార్తెలు – అమృతనందిని, తేజస్విని ఉన్నారు. 2019లో తల్లి మణియమ్మాళ్‌ మరణం వివేక్‌ను చాలా బాధించింది.

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి... ఇప్పుడు వివేక్‌ గురించి అందరూ అంటున్న మాట ఒకటే... మంచి నటుడే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని! అయిదేళ్ళ క్రితం తమిళనాట డెంగూ, మెదడువాపు జ్వరాలు ప్రబలుతున్నప్పుడు జనంలో చైతన్యం కలిగించడానికి ప్రభుత్వ ప్రచారోద్యమంలో భాగస్వామి అయ్యారు. కానీ, అదే డెంగూ, మెదడువాపు జ్వరాలకు వివేక్‌ తన కుమారుణ్ణి కోల్పోవడం విషాదం. తాజాగా కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రజల్లో కోవిడ్‌ టీకాపై అవగాహన కల్పించాలని ఆయన భావించారు.

గుండెపోటు రావడానికి సరిగ్గా ముందు రోజే వివేక్‌ తమిళనాడు ప్రభుత్వం పక్షాన కోవిడ్‌ టీకా ఉద్యమానికి ప్రచారకర్తగా నిలిచారు. ప్రభుత్వా సుపత్రిలో టీకా వేయించుకున్నారు. బండికి ఇన్సూరె¯Œ ్స చేయించుకున్నాం కాబట్టి రోడ్డు ప్రమాదం జరగదని అనుకోవడం పొరపాటని తనదైన శైలిలో కామెడీ చేస్తూనే, టీకా వేసుకొని, కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం గురించి హాస్యధోరణిలో మాట్లాడారు. ఆ మరునాడే తీవ్రమైన గుండెపోటుతో, అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య ప్రచారం కోసం ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేసిన రెండు సందర్భాలూ ఆయన జీవితంలో తీరని విషాదాలుగా మారిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, తీరని దుఃఖం మిగిల్చిన విచిత్రం.

తమిళంలో హాస్యం అంటే.. ఇప్పటికీ ఎన్‌.ఎస్‌. కృష్ణన్‌ – ఆయన సతీమణి టి.ఏ. మధురం జంట పేరే చెబుతారు. ఆ తొలితరం సినీ – నిజజీవిత జంట పండించిన హాస్యం అంత పాపులర్‌. ఆ రోజుల్లో ఎన్‌.ఎస్‌. కృష్ణన్‌ను తమిళంలో ‘కలైవానర్‌’ అని పిలిచేవారు. అంటే, ‘కళా ప్రియుడు, కళల్లో విద్వాంసుడు’ అని అర్థం. కృష్ణన్‌ మరణించిన మూడున్నర దశాబ్దాల తర్వాత సినీ రంగంలోకి వచ్చిన వివేక్‌ ‘చిన్న కలైవానర్‌’ అయ్యారు. తమిళ సినీ అభిమానుల్లో వివేక్‌కు లభించిన అతి పెద్ద గౌరవం అది అని చెప్పుకోవచ్చు. ‘పద్మశ్రీ’ లాంటి ప్రభుత్వ పురస్కారాలు దక్కినా, తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నా, జనం ఇచ్చిన ఈ ‘చిన్న కలైవానర్‌’ టైటిల్‌ను వివేక్‌ అపురూపంగా భావించేవారు.


  అబ్దుల్‌ కలామ్‌ స్ఫూర్తితో...

వివేక్‌ ఆఫీసు రూములో ఆయన టేబుల్‌ మీద తిరుక్కురళ్‌ రాసిన ప్రాచీన తమిళ కవి – సంస్కర్త తిరువళ్ళువర్, ధ్యాన ముద్రలో బుద్ధుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ బొమ్మలు కనిపిస్తాయి. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చినప్పుడు ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ను కలిశాక, మొక్కల ఉద్యమం చేపట్టారు వివేక్‌. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాదం గురించి, మొక్కల అవసరం గురించి కలామ్‌ తన డైరీలో రాసుకున్న ఓ కవిత వివేక్‌ ఉద్యమానికి ఊపిరిపోసింది. అప్పటి నుంచి ఆయన తమిళనాట హరిత ఉద్యమానికి అనధికారిక అంబాసిడర్‌ అయ్యారు. ఏకంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మేరకు ప్రజలకూ, తన ఫ్యాన్స్‌కూ పిలుపునిచ్చారు. ఇప్పటికే దాదాపు 35 లక్షల దాకా మొక్కలు నాటడంలో, నాటించడంలో సక్సెస్‌ అయ్యారు. త్వరలోనే ఆ కోటి మొక్కలతో కాంతులు నింపాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఇలా జరిగింది.

‘అయ్యో నవ్వు చచ్చిపోయిందే’... అంటూ వివేక్‌ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘తెర మీద నటించడంతో నటుడి బాధ్యత అయిపోయిందని అనుకోని వ్యక్తి వివేక్‌. సమాజానికి ఉపయోగపడేలా తన వంతుగా ఏదైనా చేయాలనుకున్న మంచి మనిషి’’ అన్నారు కమలహాసన్‌. రజనీకాంత్, వెంకటేశ్, దేవిశ్రీప్రసాద్‌ వంటి ఎందరో ప్రముఖులు వివేక్‌ హఠాన్మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాలంతో పాటు మనిషి కరిగిపోవచ్చు. కానీ... వివేక్‌ కాలంతో పాటు కరిగిపోని నవ్వులు పంచారు. మంచిని పంచారు. ఆ నవ్వుకీ, ఆ మంచికీ మరణం లేదు!

- డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top