
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.
అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు.
(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ)
ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్‌గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది.
సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్‌లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ.
