పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉన్న నటి కీర్తీ సురేశ్(Keerthy Suresh). ఆ మధ్య మహానటి, దసర, సినీ కాగితం వంటి చిత్రాలలో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్న ఈ భామ ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా తమిళంలో మంచి అంచనాలతో తెరకెక్కిన రఘు తాతా చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అదే విధంగా హిందీలో నటించిన తొలి చిత్రం బేబీజాన్ కూడా అపజయాన్నే మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో కీర్తీ సురేశ్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తాటిల్‌ను పెళ్లి చేసుకుని నటనకు చిన్న గ్యాప్ ఇచ్చారు.
ఆ తరువాత ఈమె నటించిన వెబ్ సిరీస్ ఉప్పు కప్పురంబు ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అలా గత ఏడాది నుంచి ఈ బ్యూటీకి హిట్ లేకుండాపోయింది. కాగా పెళ్లికి ముందు నటించిన చిత్రాల్లో రివాల్వర్ రీటా(Revolver Rita) ఒకటి. ది రూట్ సంస్థ, ది ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జేకే.చంద్రు దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రం అన్నది గమనార్హం. కామెడీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని గత ఏడాది ఆగస్ట్‌లోనే విడుదల కావలసింది.

కారణాలేమైనా విడుదల వాయిదా పడింది. కాగా తాజాగా రివాల్వర్ రీటాను ఈ నెల 28న విడుదల చేయడానికి ప్లాన్ రెడీ చేశారు. కాగా ఈ చిత్ర విజయం నటి కీర్తీసురేశ్‌కు చాలా అవసరం. మరి ఇది ఎలాంటి రిజల్డ్‌ను ఇస్తుందో చూడాలి. ప్రస్తుతానికి కోలీవుడ్‌లో కొత్తగా అవకాశాలు లేవు. కానీ, తెలుగులో వరుసగా అవకాశాలు వరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


