మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమా ఎట్టకేలకు లాంచ్ అయింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఆదివారం (నవంబర్ 01న) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామ్ చరణ్, సుకుమార్‌తో పాటు నిర్మాతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే దిల్ రాజు, హరీశ్ శంకర్, బుచ్చిబాబు, మారుతి తదితరులు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
కాగా గతంలో సుకుమార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ చేసిన పోస్ట్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
(ఇదీ చదవండి: ఆర్ సీ17.. ఆశలన్నీ సుకుమార్‌పైనే!)
సుకుమార్ భార్యగా ఎంతగానో..
‘ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుకుమార్ భార్యగా తనకు ఎంతగానో ఎగ్జైట్‌మెంట్ ఇస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ పడ్డ కష్టం కళ్లారా చూశాను. ఇప్పుడు ఇలా మొదలుకావడం చాలా స్పెషల్ గా అనిపిస్తోంది. ప్రేక్షకులు లాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఈసారి అనిరుధ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 400 మంది కష్టాన్ని ట్రోల్స్ చేయద్దు : స్టార్ డైరెక్టర్)


