తెలుగింటి కోడలైన రష్మికని మరో అద్భుతమైన అవకాశం వరించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న అవార్డ్ గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పడింది.
(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో)
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రస్తావన గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉంది. సాయిపల్లవి, రుక్మిణి వసంత్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ చివరకు రష్మిక ఈ సదావకాశం దక్కించుకుంది. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఈ మూవీ గ్రాండ్ లాంచ్ జరగనుంది. కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
'MS – A Legacy on Screen' (ఎమ్ఎస్: ఏ లెగసీ ఆన్ స్క్రీన్) పేరుతో ఈ బయోపిక్ రానుంది. చెన్నైలో జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఇండియన్ చోరల్ ఎన్‌సెంబుల్ ప్రత్యేకంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన కొన్ని ప్రముఖ గీతాలను ప్రదర్శించి ఆమెకు నివాళులు అర్పించనున్నారు. ఇకపోతే అల్లు అరవింద్, బన్నీవాసు, రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెర్సీ, మళ్లీరావా, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించబోతున్నాడు.
ఇప్పటివరకు కమర్షియల్, యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్న రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా ఎలా కనిపించనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్రవేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.. సంగీత రంగానికే పరిమితం కాలేదు. సేవాసదనం, శకుంతలై, సావిత్రి, మీరా లాంటి సినిమాల్లోనూ కనిపించారు.
రష్మిక విషయానికొస్తే చాన్నాళ్లుగా తెలుగులో నటిస్తున్న ఈమె.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లిచేసుకుంది. వివాహం తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'రణబాలి' అనే మూవీ చేశారు. వచ్చే నెల 16న ఇది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. అలానే రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' నవంబర్ 27న రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: రష్మికతో ఐటెం సాంగ్.. ఆ భయంతో తీసేశారు: తమన్)


