రామ్‌చరణ్‌ టూ ప్రభాస్‌..టుస్సాడ్స్‌లో స్టార్స్‌...ఎవరు గ్రేట్‌? | Ram Charan To Prabhas Tollywood Stars Who Got Their Own Wax Statue At Madame Tussauds | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ టూ ప్రభాస్‌..టుస్సాడ్స్‌లో స్టార్స్‌...ఎవరు గ్రేట్‌?

May 21 2025 4:31 PM | Updated on May 21 2025 5:01 PM

Ram Charan To Prabhas Tollywood Stars Who Got Their Own Wax Statue At Madame Tussauds

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం.  ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది.  ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్‌ సింబల్స్‌గా మారాయి. 

ఇటీవల మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్‌ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్‌ స్టార్స్‌ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్‌ స్టార్స్‌ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం  టాలీవుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌ది.  ఇటీవల లండన్‌ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్‌ చరణ్‌  అతని పెంపుడు కుక్క రైమ్‌ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో తన పెట్‌తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్‌ చరణ్‌ రికార్డ్‌ సాధించాడు.

గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం  దుబాయ్‌లో అల్లు అర్జున్‌  మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.    అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్‌ ధరించి,  మేడమ్‌ టుస్సాడ్స్‌ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అంటూ  టుస్సాడ్స్‌ పేర్కొనడం విశేషం.

గత  2019 మార్చి లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు  తన మేడమ్‌ టుస్సాడ్స్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్‌ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్‌ దక్కించుకున్నాడు.  

ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్‌... మేడమ్‌ టుస్సాడ్స్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత  2017మార్చి లో బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా,  బ్లాక్‌బస్టర్‌ విజయాల ద్వారా  జపాన్, చైనా, మలేషియా, సింగపూర్‌  అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement