
– రజనీకాంత్‌ని ఉద్దేశించి హృతిక్ రోషన్
‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్ దాదా’(1986). రాకేశ్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్ దాదా’ గా రజనీకాంత్ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది.
‘కూలీ, వార్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్ సార్.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు.