రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్‌డ్ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.
ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు.


