గొడవ జరుగుతుందని వెళ్తే..కేసులు పెట్టారు : సుమలతపై రఘు మాస్టర్‌ ఫైర్‌ | Raghu Master Fires On SumaLatha | Sakshi
Sakshi News home page

సుమలత విభజించి పాలిస్తున్నారు..అందుకే ఈ సమస్యలు : రఘు మాస్టర్‌

Sep 26 2026 12:54 PM | Updated on Sep 26 2026 1:40 PM

Raghu Master Fires On SumaLatha

గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత(జానీ మాస్టర్‌ సతీమణి)ను పదవి నుంచి తొలగిస్తూ.. ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమలత, రఘు మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ సుమలత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వ్యవహారంపై డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్ స్పందించారు. శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అసోసియేషన్‌లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడూతూ..సుమలతపై పలు ఆరోపణలు చేశాడు.

‘డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో దాదాపు 600 మంది డ్యాన్సర్లు ఉన్నారు, అయితే అందులో నలుగురు వ్యక్తుల వల్లే సమస్యలు వస్తున్నాయి. నాలుగు అవినీతి ఎలుకల కోసం ఇల్లు తగలబెట్టాలా? అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత కొంతమందికి మద్దతు ఇస్తూ వ్యవహరించడం వల్లే సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు అసోసియేషన్‌ను లేకుండా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకే సీనియర్స్‌గా తాము బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది.

ఫెడరేషన్ తమకు తల్లి లాంటిది. ఫెడరేషన్ అనుకూలంగా ఉంటే ఒకలా, అనుకూలంగా లేకపోతే మరోలా వ్యవహరించడం సరికాదు.మొన్న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సుమలత వర్గానికి చెందిన కొందరు మాట్లాడుతున్న సభ్యుల నుంచి మైక్ లాక్కున్నారు. అధ్యక్షురాలి హోదాలో ఉన్న సుమలత వారిని నియంత్రించాల్సిందిపోయి, వారినే సమర్థిస్తే ఎలా? అసోసియేషన్‌లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడేందుకు చాలామంది డ్యాన్సర్లు భయపడుతున్నారు. అందుకే సీనియర్స్‌గా తాము మాట్లాడుతున్నాం. యూనియన్‌కు సమస్య వచ్చినప్పుడు మేము కచ్చితంగా స్పందిస్తాం. 

ఇటీవల జరిగిన బాడీ మీటింగ్‌లో సుమలత మినిట్స్ బుక్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో మేము వెళ్తే, మా పేర్లు పెట్టి సుమలత కేసులు పెట్టారు.అయినా భయపడేది లేదు. సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎన్నికలకు వెళ్తున్నాం. అసోసియేషన్‌లో నెలకొన్న సమస్యలకు ఎన్నికల ద్వారా పరిష్కారం లభిస్తుంది’ అని రఘు మాస్టర్‌  అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement