కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’ వివాదంలో చిక్కుకుంది. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 28న మొదట హిందీలో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రంపై ఈరోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ముంబై కోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్‌పై నష్టపరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కిందని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.

‘తేరే ఇష్క్ మే’ విడుదల సమయంలో 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్ అని ప్రచారం చేశారు. ఇదే వారికి చిక్కులు తెచ్చింది. ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో 'రాంఝణా' (Raanjhanaa) చిత్రాన్ని 2013లో తెరకెక్కించారు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 105 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్ర యూనిట్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ అంటూ తేరే ఇష్క్ మే చిత్రాన్ని మేకర్స్ పబ్లిసిటీ చేసుకున్నారు. దీనిని ఈరోస్ సంస్థ తప్పుబట్టింది. తమ ప్రమేయం లేకుండా సీక్వెల్ అని ఎలా ప్రకటిస్తారంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది. 'రాంఝణా' సినిమాకు సీక్వెల్ అని చెప్పుకుని భారీగా లాభపడ్డారని ఆ సంస్థ పేర్కొంది.
ఆనంద్ ఎల్. రాయ్ చర్యల వల్ల తమ సినిమా ఇమేజ్ దెబ్బతిందని, అందుకు గాను రూ. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఈరోస్ కోరింది. 'రాంఝణా' సినిమాకు ఆనంద్ ఎల్. రాయ్ కేవలం దర్శకుడు మాత్రమేనని ఆ మూవీకి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని ఈరోస్ చెప్పింది. తమ ప్రమేయం లేకుండా 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్ అంటూ ‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నారని ఆ సంస్థ ఆరోపించింది. మరీ ముఖ్యంగా, తేరే ఇష్క్ మే టీజర్‌లో 'ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ రాంఝణా, #వరల్డ్ ఆఫ్ రాంఝనా' వంటి హ్యాష్ ట్యాగ్‌లు ఉపయోగించబడ్డాయని ఈరోస్ హైలైట్ చేసింది. ప్రస్తుతానికి, తేరే ఇష్క్ మే నిర్మాతలు స్పందించలేదు.


