పుట్టపర్తి సత్యసాయి (Puttaparthi Sathya Sai Baba) మహిమలు అనంతం. ఆయన్ని ఆరాధించే భక్తులెందరో.. ఆయన లీలల ఆధారంగా తెరకెక్కుతున్నచిత్రం అనంత. పుట్టపర్తి సాయిబాబా శత జయంతి సందర్భంగా ఈ చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు, సుహాసిని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్‌కృష్ణ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి, పా.విజయ్ మాటలు, పాటలు అందిస్తున్నారు. గిరీష్ కష్ణమూర్తి నిర్మిస్తున్నారు.
సోమవారం సాయంత్రం ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని మ్యూజిక్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జాతీయ ట్రస్ట్ నిర్వాహకులు రత్నాకర్ పాల్గొని టీజర్‌ను ఆవిష్కరించారు. సురేష్ కృష్ణ మాట్లాడుతూ.. 2009లో సత్యసాయి బాబా జీవిత చరిత్రను చిత్రంగా చేయాలని ఒక మిత్రుడు చెప్పారన్నారు. దీంతో తాను పుట్టపర్తికి వెళ్లానని అక్కడ బాబా సమాధి సమీపంలో.. ఇన్నేళ్లు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు వచ్చావు అంటూ తెలుగులో బాబా చెప్పినట్లు మాటలు వినిపించాయన్నారు.
గత ఏడాది ఒకరోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన కలలోకి బాబా వచ్చి విబూది ఇచ్చారని చెప్పారు. నా దర్శకత్వంలో సాయిబాబా చిత్రాన్ని చేయాలని రత్నాకర్‌తో చర్చించినట్లు ఒక మిత్రుడు చెప్పారన్నారు. ఆ తర్వాత నిర్మాత గిరీష్ కృష్ణమూర్తి.. తనకు కూడా కలలో సాయిబాబా చిత్రాన్ని చేయాలన్న ఆదేశం వచ్చిందని చెప్పారన్నారు. అలా సాయిబాబా శతజయంతి సందర్భంగా అనంత చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు.


