ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు.
గత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్‌లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చారు.


