‘‘సినిమాల్లో నేను పోషించేపాత్రలపై నా వ్యక్తిత్వ ప్రభావం ఉండదు. నేననేవాడిని లేకుండా సినిమాల్లో నేను పోషించే పాత్రల్లోకి నటుడిగా నేను ఎంటర్ కావాలి. నన్ను నేను వెనక్కి పెట్టుకుంటేనే ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త తరహాపాత్రలు చేయగలను. ‘మల్లేశం, బలగం, కోర్టు’ వంటి చిత్రాలు ఇలా వచ్చినవే. ఎవరైనా మీ స్టైల్లో ఒక సినిమా చేద్దామంటే నాకేం స్టైల్ లేదు. మీరేదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్ అవుతుందని చెప్తుంటాను’’ అని ప్రియదర్శి అన్నారు.
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శి చెప్పిన విశేషాలు...
⇒ ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షనే నాకు ఈ సినిమాకి కూడా ఉంది. ఒక రైతు వాన కోసం ఎదురు చూసినట్లు నేను కూడా సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటాను (నవ్వుతూ...). మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అనుకోవడం దగ్గర్నుంచి ఇలా కూడా ఉండొచ్చని మా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనం ఎప్పుడు, ఏ విధంగా, ఏ టైమ్‌లైన్‌లో చె΄్పాం అన్నది ముఖ్యం. ‘ప్రేమంటే..’ని అందరూ రిలేట్ చేసుకుంటారు.
⇒ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాస్త కొత్తగా ఉంటుంది. ఆనంది మంచి పెర్ఫార్మర్. చాలా ప్రోఫెషనల్. సుమక్క నుంచి చాలా నేర్చుకున్నాను. నవనీత్ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. పెళ్లిపై మెచ్యూరిటీతో ఈ కథ రాశాడు. సునీల్ నారంగ్, రామ్మోహన్‌రావు, జాన్వీగార్లు మంచిగా సపోర్ట్ చేశారు. ∙నేను విలక్షణమైన కథలు చేస్తాననే గుర్తింపును ప్రేక్షకులు ఇచ్చారు. ఈ బాధ్యతతో సినిమాలు చేస్తున్నాను. అలాగే నాతో సినిమాలు చేసే నిర్మాతలు నష్టపోకూడదనుకుంటాను. ‘డార్లింగ్’ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్. ‘సారంగపాణి, డార్లింగ్, మిత్రమండలి’ సినిమాలు థియేటర్స్‌లో ఆడకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ... ఇప్పటి వరకు నేను కాస్ట్ ఫెయిల్యూర్ హీరోని అయితే కాదు. ప్రస్తుతం ‘అసమర్థుడు’, ‘సుయోధన’ అనే సినిమాలు చేస్తున్నాను.


