‘‘నేను నార్త్ నుంచి సౌత్‌కి వచ్చాను. ఇక్కడ ఒక స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎంత గొప్పగా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో చూశాను. అదో గొప్ప ఎమోషన్. ఎలాంటి రిలేషన్ లేకుండా, పరిచయం లేకుండా ఒక వ్యక్తిని ప్రేక్షకులు అంతలా ఎలా అభిమానిస్తారు? అనిపించేది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కథను పి. మహేశ్‌బాబు చెప్పినప్పుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది’’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.
రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను మహాలక్ష్మి అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. మంచి ఎమోషన్ ఉన్న ఈపాత్ర నాకు చాలా స్పెషల్.
సాగర్ (రామ్ క్యారెక్టర్)తో తను ప్రేమలో ఉంటుంది. తెలుగులో నేను కలిసిన తొలి నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు.ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్స్. తెలుగులో నాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండం హ్యాపీ. ఆ ప్రేమ నాకు ఇంకా కావాలి. నాకు వచ్చిన ప్రతిపాత్రకి వంద శాతం కష్టపడుతూ, వెర్సటైల్ యాక్ట్రస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పారు.


