‘‘ఈ రోజుల్లో ఆడియన్స్‌కు ఏదైనా కొత్తగా చెబితేనే థియేటర్స్‌కు వస్తున్నారు. నా ప్రయత్నంలో భాగంగా నేను తొలిసారిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ మూవీ చేశాను. నా ప్రతి సినిమాకూ నాకు టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాం. ఫుల్‌పాజిటివ్ ఫీలింగ్‌తో ఉన్నాం. ఇటీవలి కాలంలో ఈ సినిమాలోని స్క్రీన్‌ప్లేతో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.
ఈ కథలోని మైండ్‌గేమ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అని ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల హీరోయిన్. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్‌గా ఉన్న ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.
⇒ ఈ చిత్రంలో లోకల్ ఎమ్మెల్యే దగ్గర పని చేసే కార్తీక్ అనేపాత్రలో నటించాను. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేశాం. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ఇది పూర్తిగా హారర్ సినిమా కాదు.పారానార్మల్ టింజ్ ఉంటుంది. ఈ సినిమా కథను అనిల్ చెబుతున్నప్పుడు ఇంట్రవెల్ సీక్వెన్స్‌కు షాక్ అయ్యాను. కథలో ఎక్కడో మొదలైన సీన్‌కి చివర్లో మరో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి.
ఈ సినిమా రిలీజ్ తర్వాత స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటారు. అలాగే నేనో మంచి సినిమా చేశాననే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుందనే నమ్మకం ఉంది. నాని సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. శ్రీనివాసగారి బేనర్లో నేను చేసిన తొలి సినిమా ‘నా సామిరంగ’ (ఇందులో నాగార్జున హీరో). రాజీ పడకుండా ‘12ఎ రైల్వే కాలనీ’ సినిమాను నిర్మించారాయన. మనం మరో సినిమా చేద్దామని ఆయన నాతో చె΄్పారు.
⇒ హాస్యనటుడిగా నేను దాదాపు యాభై సినిమాలు చేశాను. ప్రతివాళ్ళు మీ ఫలానా కామెడీ సినిమా బాగుందనే వారు. కానీ యాక్టర్‌గా నా గురించి మాట్లాడేవారు కాదు. అయితే నటుడికి గుర్తింపే ముఖ్యం. నేను సీరియస్ సినిమాలు, కామెడీ సినిమాలూ చేశాను. కామెడీ చేయడం చాలా కష్టం. ఇప్పటి ప్రేక్షకులు కొత్త రకం కామెడీ, ఆర్గానిక్ కామెడీని కోరుకుంటున్నారు. ∙దర్శకుడిగా సినిమా చేయాలని ఉంది.
దర్శకుడిని అయితే కథలో ఇన్‌వాల్వ్ అవుతానని, దర్శకుడిగా బిజీ అవ్వాలనుకుంటున్నానని అనుకుని యాక్టర్‌గా నాకు అవకాశాలు రాకపోవచ్చు. అందుకే నాలుగైదేళ్ల తర్వాత డైరెక్షన్ చేస్తాను. ఓ మూకీ సినిమా చేయాలని ఉంది. ఒక్క డైలాగ్ లేకుండా రెండున్నర గంటలు నవ్వించడం చిన్న విషయం కాదు. ఇక రెండు కామెడీ సినిమాలు చేయబోతున్నాను. నేను నటించిన ‘ఆల్కహాల్’ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది.


