అశోక గజపతిరాజు, బాలకృష్ణ, ప్రమోద్ సావంత్, మురుగన్
‘‘భారతీయ దర్శకులు, నిర్మాతలు, కథారచయితలు... ఇలా అందరూ ప్రపంచాన్ని కలుసుకునే వేదిక ఇది. గోవాను క్రియేటివ్ క్యాపిటల్‌గా మలిచే దిశగా కృషి చేస్తున్నాం. చిత్ర నిర్మాణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గోవా ఫిల్మ్ మేకర్స్‌ను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) గురువారం భారీ పరేడ్ నేపథ్యంలో గోవా గవర్నర్ అశోక గజపతిరాజు ప్రారంభించారు. 2004లో మనోహర్‌పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇఫీలోపాల్గొడానికి గోవా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అశోక గజపతిరాజు గుర్తుచేసుకున్నారు.
50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన ఘనతకు గుర్తింపుగా ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘ఇఫీ వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సనాతన ధర్మం సత్తా చూపించేలా ‘అఖండ 2’ రూ పొందింది. ప్రస్తుతం నటనని గ్రాఫిక్స్ డామినేట్ చేస్తున్నాయి. అయితే నా సినిమాలను గమనిస్తే నేనే వాటిని డామినేట్ చేస్తాను’’ అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఔత్సాహిక యువతను ప్రోత్సహించేందుకు మారియట్ హోటల్‌లో కేంద్ర మంత్రి మురుగన్ ఆరంభించిన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్–2025’ ప్రారంభ కార్యక్రమంలో కూడా బాలకృష్ణపాల్గొన్నారు.
టాలీవుడ్ సందడి: ‘ఇఫీ’ కార్యక్రమాల్లో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగాపాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీలీల, ‘దిల్’ రాజు, సి కల్యాణ్, మాదాల రవి, వీరశంకర్, భరత్ భూషణ్ తదితరులుపాల్గొన్నారు. ‘‘్రపాంతీయ భాష నుంచిపాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ప్రాంతాలకు అతీతంగా ఇంతమందిని ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ‘ఇఫీ’లాంటి వేదికలు ఉపకరిస్తాయి’’ అన్నారు ‘దిల్’ రాజు, మాదాల రవి. హిందీ పరిశ్రమ నుంచి అనుపమ్ ఖేర్, రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా, శేఖర్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి


