భానుమతీ రామకృష్ణతో సహా పలువురు ప్రముఖుల శత జయంతి వేడుకలు
సాధారణ బస్ కండక్టర్ నుంచి చిత్రసీమలోకి వచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌కి 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సత్కారం జరగనుంది. గోవా వేదికగా ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ ‘ఇఫీ 2025’ వేడుక 28 వరకూ సాగుతుంది. ముగింపు రోజున రజనీకి సత్కారం జరగనుంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, తొలి నాళ్లల్లో విలన్‌గా, ఆ తర్వాత హీరోగా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. చిత్రరంగానికి సుదీర్ఘ సేవలు అందించినందుకుగానూ రజనీకాంత్‌ని ఘనంగా సత్కరించాలని ‘ఇఫీ’ నిర్ణయించుకుంది.
అలాగే గత ఏడాది అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, తపన్ సిన్హా, మొహమ్మద్ రఫీ వంటి లెజెండ్స్ శత జయంతి వేడుకలు నిర్వహించినట్లుగా ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ‘ఇఫీ’. ప్రముఖ తెలుగు నటి–దర్శక–నిర్మాత–గాయని పి. భానుమతీ రామకృష్ణ, ప్రఖ్యాత నటుడు–దర్శక–నిర్మాత గురుదత్, మరో ప్రముఖ దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, గొప్ప ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న దర్శక–రచయిత రిత్విక్ ఘటక్, లెజెండరీ సింగర్–రైటర్–మ్యూజిక్ డైరెక్టర్ భూపేన్ హజారికా, మరో ప్రముఖ గాయకుడు–రచయిత సలీల్ చౌదరిల శత జయంతి వేడుకలు ‘ఇఫీ 2025’లో జరగనున్నాయి. ఈ స్టార్స్‌కి సంబంధించిన ఒక్కో ‘ఐకానిక్ ఫిల్మ్’ని ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.


