YS Jagan Biopic: Pratik Gandhi As YS Jagan Mohan Reddy In Biopic - Sakshi
Sakshi News home page

YS Jagan Biopic: వెండితెరకు వైఎస్‌ జగన్‌ విజయ యాత్ర

Jul 3 2021 12:01 AM | Updated on Jul 3 2021 11:53 AM

Pratik Gandhi As YS Jagan In Biopic - Sakshi

ప్రతీక్‌ గాంధీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మహీ వి. రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మహీ వి. రాఘవ్‌. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బయోపిక్‌ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది.

జగన్‌ జీవితంపై సినిమా అనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై వైఎస్‌ జగన్‌ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో, చిత్రపరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. జగన్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది మరింత ఆసక్తిగా మారింది. ‘జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా’ అని తమిళ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగితే చెప్పారు. దీంతో సూర్య నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అజ్మల్‌ నటిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు, ‘స్కామ్‌ 1992’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది.

ప్రతీక్‌ ఆహార్యం, హావభావాలు జగన్‌కి దగ్గరగా ఉంటాయని భావించి, మహీ ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. ఈ బయోపిక్‌ గురించి దర్శకుడు చెప్పగానే చాలా ఎగై్జట్‌ అయి, నటించడానికి ప్రతీక్‌ అంగీకారం తెలిపారని భోగట్టా. వైఎస్‌ జగన్‌ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ప్యాన్‌ ఇండియా చిత్రంగా తీయనున్నారట. జగన్‌ సొంతంగా పార్టీ స్థాపించడం, పాదయాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement