
‘‘తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌గారి పేరుతో అవార్డ్స్(Gaddar Awards) ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఈ అవార్డు కమిటీ జ్యూరీకి మురళీ మోహన్ , జయసుధలను చైర్మన్లుగా నియమించడం ఏంటో అర్థం కాలేదు. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ‘దిల్’ రాజు తన అధికారాలను దుర్వినియోగం చేశారు. తన వాళ్లకే అవార్డ్స్ ఇచ్చుకున్నారు. జ్యూరీ కమిటీలో ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకూడదనే నిబంధనలను పాటించలేదు. థియేటర్స్ బంద్ విషయంలోనూ ‘దిల్’ రాజు ప్రమేయం ఉంది’’ అని ‘తెలంగాణ ఫిలిం చాంబర్’ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. జ్యూరీ కమిటీ సభ్యులు అన్ని సినిమాలు చూడలేదు. థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం వల్ల గతంలో లాభాలు ఆర్జించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రస్తుత విధానాల వల్ల నష్టాలు వస్తున్నాయి.

2002 వరకు థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం ఉండేది. ఆ తర్వాత నిర్మాత డి. సురేష్ బాబులాంటి కొందరు తమ స్వార్థంతో అద్దె విధానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, ఏషియన్ సునీల్.. లాంటి వాళ్లు సురేష్ బాబు బాటలోనే నడిచి థియేటర్స్‌ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు’’ అన్నారు. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’లను ప్రభుత్వం పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, నటుడు కిరణ్, తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, తెలంగాణ రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృత్ గౌడ్ కోరారు.