ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో జూలై 30న ఈడీ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా.. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..'నోటీసులు రావడంతోనే సీఐడీ విచారణకు హాజరయ్యా. బ్యాంకు స్టేట్‌మెంట్స్ అన్ని గతంలోనే సమర్పించా. 2016లో బెట్టింగ్ యాప్‌కి ప్రమోషన్ చేశా. 2017లో బెట్టింగ్ యాప్‌లను నిషేధించారు. బెట్టింగ్ యాప్ ఎవరు వాడకండి. యువత బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దు.. అడ్డదారిలో వెళ్లకండి. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. సీఐడీ విచారణలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం ఇచ్చా. బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా రాంగ్ వే. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా యంగ్ స్టార్స్ అర్థం చేసుకోవాలి. వీటివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. అది బాధాకరమైన విషయం' అని అన్నారు.
కాగా.. ఈ బెట్టింగ్ యాప్ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు టాలీవుడ్ తారలు కూడా సీఐడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ కూడా సీఐడీ విచారణ ఎదుర్కొన్నారు. మంగళవారం గంటకుపైగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కాగా.. గతంలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.



