వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు! | Prabhas Movies Raja Saab, Radhe Shyam Flop And Here's The Reasons | Sakshi
Sakshi News home page

Prabhas: 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నాడు?

Jan 21 2026 9:58 AM | Updated on Jan 21 2026 10:24 AM

Prabhas Movies Raja Saab, Radhe Shyam Flop And Here's The Reasons

ఏ హీరో.. ఏ దర్శకుడు.. ఏ నిర్మాత కూడా ఫ్లాప్ సినిమాని తీయాలనుకోరు. కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మాత్రం కాంబినేషన్ ప్రకటించినప్పుడే సందేహాలు వస్తుంటాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అవి నిజమవుతుంటాయి. రీసెంట్ టైంలో 'రాజాసాబ్' ఓ ఉదాహరణ. ప్రభాస్ విషయంలో పలుమార్లు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది? ప్రభాస్ ఏం చేస్తున్నాడు?

'బాహుబలి' ముందు వరకు ప్రభాస్ ఓ సాధారణ హీరోనే. చెప్పుకోవడానికి కొన్ని హిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రాజమౌళితో ఈ మూవీ చేశాడో.. దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని నిలబెట్టుకునే క్రమంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది. తెలిసో తెలియకో ప్రభాస్ కొన్ని తప్పటడుగులు వేశాడు, ఇప్పటికీ వేస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది.

ఎందుకంటే పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత ఏ హీరో అయినా సరే తనకు సూట్ అయ్యే దర్శకుల్ని, స్టోరీల్ని ఎంచుకుని సినిమాలు చేయాలి. అప్పుడు రేంజ్ పెరిగేందుకు అవకాశముంటుంది. క్రేజ్ ఉంది కదా అని తొందరపడకూడదు. ప్రభాస్ కూడా ఇలానే స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లేని కొందరు మిడ్ రేంజ్ దర్శకులకు అవకాశాలిచ్చి తన విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడా అనిపిస్తుంది!

'బాహుబలి' తర్వాత ఒకేఒక్క సినిమా తీసిన సుజీత్‌కి ప్రభాస్ అవకాశమిచ్చాడు. మూవీకి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఎందుకో ఆడియెన్స్‌కి మూవీ పూర్తిస్థాయిలో నచ్చలేదు. దీంతో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' అయితే డార్లింగ్ ఫ్యాన్స్‌కి పీడకలగా మిగిలిపోయింది. ప్రభాస్ లాంటి నటుడిని పెట్టుకుని ఇలాంటి సినిమానా తీసేది అని దర్శకుడు రాధాకృష్ణని విమర్శించని వాళ్లు లేరు.  తర్వాత వచ్చిన 'ఆదిపురుష్' అయితే ఇంకా దారుణం. కథ పరంగా పెద్దగా కంప్లైంట్స్ లేనప్పటికీ ప్రభాస్‌ని చూపించిన విధానం, మూవీలో ఉపయోగించిన గ్రాఫిక్స్‪‌పై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్‌ని ప్రభాస్ అభిమానులు ఎంతలా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సలార్, కల్కి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడని ఫ్యాన్స్ సంతోషించేలోపు.. 'రాజాసాబ్‍'తో ప్రభాస్‌కి మారుతి మర్చిపోలేని ఫ్లాప్ ఇచ్చాడు. కథ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ అస్సలు వర్కౌట్ కాలేదు. మూవీలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తలని వేరే బాడీకి అతికించినట్లు ఉన్న కొన్ని సీన్స్ అయితే విపరీతమైన ట్రోలింగ్‌కి కారణమయ్యాయి. ఈ సినిమాలన్నీ గమనిస్తే.. పాన్ ఇండియా చిత్రాలు తీసిన అనుభవం లేని రాధాకృష్ణ, మారుతి లాంటి దర్శకులకు అవకాశమిచ్చిన ప్రతిసారీ ప్రభాస్ దారుణమైన ఫలితాలు చూశాడు. ఇకనుంచైనా కాస్త అనుభవమున్న డైరెక్టర్స్‌తో, ఆలస్యమైనా సరే మంచి కాన్సెప్ట్ మూవీస్ చేస్తే బెటర్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్', హను రాఘవపూడి తీస్తున్న 'ఫౌజీ' ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement