తమిళనాడులో శివకార్తికేయన్, విజయ్ దళపతి ఫ్యాన్స్ వార్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘పరాశక్తి’పై విజయ్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవ్ రామ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు.
రౌడీయిజంతో పోరాడుతున్నాం
ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధా కొంగర ఇలా అన్నారు. 'ప్రస్తుత కాలంలో సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మార్కెటింగ్ యుగంలో ఎన్నో సవాళ్లను దాటుకోవాలి. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవు. పొంగల్ వారాంతంలో మా సినిమా (పరాశక్తి) మరింత మందికి చేరువవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫేక్ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. విజయ్ ఫ్యాన్స్ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఏంటి.. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మేము రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం.' అంటూ ఆమె అన్నారు.
జన నాయగన్, పరాశక్తి రెండు సినిమాలకు సెన్సార్ చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పరాశక్తి మూవీకి 25 కట్స్ సూచించి విడుదలకు 4గంటల ముందు సెన్సార్ ఇచ్చారు. కానీ, జన నాయగన్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పరాశక్తి సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయ్‌నిధి స్టాలిన్ పంపిణీ చేశారు. దీంతో జన నాయగన్‌పై రాజకీయ కుట్ర జరిగిందని విజయ్ ఫ్యాన్స్ భావించారు. అందుకే పరాశక్తి సినిమా పట్ల వారు నెగటివ్ రివ్యూలు ప్రారంభించారని తెలుస్తోంది.


