
తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్‌లో అనేక సినిమాలు హిట్‌గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..
రియల్ స్టోరీ
సుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.
కథ
అడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ
హీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్‌లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్‌లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.
The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL
— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025