ఓటీటీపై కొరడా: నెట్‌ఫ్లిక్స్‌-అనురాగ్‌పై తొలి ఫిర్యాదు

OTT Regulations First Complaint Filed On Anurag Kashyap Netflix Short - Sakshi

స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్‌ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది.

అనురాగ్‌ తీసిన ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్‌ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్‌ అయ్యి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్‌లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్‌ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్‌ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్‌ తీయడం మహిళల మానసిక స్థితిపై  తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్‌ రిలీజ్‌ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్‌ చేసిన మార్గదర్శకాల్లో ఉంది.
 
అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్‌ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్‌ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్‌ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్‌ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్‌ మేకర్స్‌ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్‌-2021’ను రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్‌ గేమ్స్‌, ఏ సూటబుల్‌ బాయ్‌’ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top