
‘‘ఇకనుంచి టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉండేదంతా ఒక్కటే... ‘ఇండియన్ సినిమా’. అందుకే హద్దులు పెట్టుకోదలచుకోలేదు. కథ నచ్చితే సినిమా చేసేస్తా. హిందీ ‘వార్ 2’ ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్. చాలా బలమైన కథ కావడంతో ఈ సినిమా చేశాను’’ అని హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘వార్ 2’ ఈ నెల 14న విడుదల కానుంది.
ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకోవడానికి గల ముఖ్య కారణం ‘కథ’ అని చెప్పారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ గురించి మాట్లాడారు. ‘‘వారసత్వాన్ని అనుసరించి మీరు హీరోలే అవ్వాలి అని మా అబ్బాయిలతో చెప్పను. ఓ వారధిలా ఉండి ఈ ప్రపంచం గురించి, సంస్కృతుల గురించి వారికి అవగాహన కల్పించాలనుకుంటున్నాను.
సొంతంగా అనుభవం సంపాదించుకునే స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు ఆదివారం కూడా షూటింగ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం వారంలో ఒక్క రోజైనా కుటుంబంతో గడపాలని ఫిక్స్ అయి, ఆదివారం దాదాపు సెలవు తీసుకుంటున్నాను. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ల చదువులతో బిజీ అయిపోతారు. దాంతో వాళ్లతో కావాల్సినంత టైమ్ గడపడానికి కుదరదు. అందుకే పండగ లప్పుడు ఇంటిపట్టునే ఉండి, పండగల అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంటా’’ అని పేర్కొన్నారు.